మంత్రి తీరుతో తెలుగోడి గౌరవం నవ్వులపాలు
విమానయాన శాఖ మంత్రి
రామ్మోహన్‌నాయుడు డొల్లతనం తేటతెల్లం
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
లక్కవరపుకోట: కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో నవ్వులపాలు చేశారని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. ఎల్.కోటలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో పెద్ద పెద్ద ప్రసంగాలతో గొప్పలకు పోయిన మంత్రి ఈ రోజు దేశ విమానయానం సంక్షోభంలో పడిపోతే పలాయనం పుచ్చుకున్నారని ఎద్దేవాచేశారు. ప్రైవేటీకరణ ఎంత ప్రమాదమో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రైవేటీకరణతో దేశ, రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం ఈ రోజు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ ఉచ్చులోపడి పేదవారి భవిష్యత్తు విస్మరిస్తున్నాయన్నారు. ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారని, రాష్ట్రంలో ప్రస్తుత ఏడాదిలో 38.2 కోట్లు పనిదినాలను కోత వేయడం విచారకరమన్నారు. రాష్ట్రంలో సుమారు 50వేలకు పైగా రైతులకు అన్నదాత సుఖీభవ వర్తించలేదన్నారు. గడిచిన 18 నెలల పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు పాల్గొన్నారు.


