ఒలింపియాడ్ గోల్డ్ మెడలిస్ట్‌కు ఎస్పీ అభినందనలు
విజయనగరం: ఇటీవల ముంబైలో కేంద్రప్రభుత్వం నిర్వహించిన ‘ఒలింపియాడ్ అమెచ్యూర్ ఇండియా‘ బాడీ బిల్డింగ్ పోటీల్లో దివ్యాంగుల విభాగానికి సంబంధించి జరిగిన పోటీలో జిల్లాకు చెందిన బాడీ బిల్డర్ ఈదుబిల్లి సూర్యనారాయణ గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని, ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ప్రశంశించారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌తో కలిసి సూర్యనారాయణ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పుట్టుకతోనే పోలియో బారిన పడిన సూర్యనారాయణ ఏ మాత్రం నిరాశ చెందకుండా బాడీ బిల్డింగ్ పట్ల తనకున్న ఆశక్తితో సాధన చేస్తూ అనేక రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో మెడల్స్ సాధిస్తూ అద్భుతంగా రాణిస్తున్నాడని ప్రశంసించారు. వచ్చే ఏడాది మార్చి 6న అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు ఎంపికై న సూర్యనారాయణ అక్కడ కూడా ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయిలో జిల్లా కీర్తి ప్రతిష్టలు మరింతగా పెంచాలన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తదితరులు పాల్గొన్నారు.


