దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించారు. 41 రోజుల పాటు ఉపవాస దీక్షతో గడిపారు. దైవనామస్మరణలో తరించారు. శబరి చేరుకుని మొక్కుబడి చెల్లించారు. తిరుగు ప్రయాణంలో నలుగురు భక్తులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసింది. ఒకరిని ఆస్పత్రిపాల చేసింది. కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది.
దత్తిరాజేరు/గజపతినగరం: అయ్యప్పమాల ధరించి శబరి వెళ్లి.. తిరిగి వస్తున్న అయ్యప్ప భక్తులు తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం సమీపంలోని రామనారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం తెల్లవారు జామున ఆగి ఉన్న కారును వెనుక నుంచి మరో కారు బలంగా ఢీకొనడంతో దత్తిరాజేరు మండలం కె.కొత్తవలస గ్రామానికి చెందిన ముగ్గురు, మరుపల్లికి చెందిన ఒక అయ్యప్ప భక్తుడు మృతి చెందారు. కె.కొత్తవలస అయ్యప్ప సన్నిధి నుంచి ఈ నెల 1వ తేదీన వంగర రామకృష్ణ(54), మరడ రాము(50), మార్పిన అప్పలనాయుడు(31)తో పాటు గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరరావు (35), గజపతినగరానికి బెవర శ్రీరాం ఇరుముడి కట్టుకొని కారులో శబరి బయలు దేరారు. 4వ తేదీన శబిరిలో అయ్యప్పకు మొక్కుచెల్లించారు. వచ్చేదారిలో కారు పక్కకు నిలిపి విశ్రాంతి తీసుకుంటుండగా వెనుక నుంచి మరో కారు ఢీ కొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలు గురు మృతిచెందగా, డ్రైవర్ బెవర శ్రీరాం రామేశ్వరంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
● గురుస్వామిగా పేరుపొంది...
మృతుడు రామకృష్ణ 20 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ చేస్తున్నారు. కొత్తవలస గ్రామంలో గురుస్వామిగా పేరు పొందారు. వడ్రంగి పనిచేస్తూ భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు భవాని, లతతో పాటు వృద్ధురాలైన తల్లి సూరమ్మను పోషిస్తూ వస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు దైవదర్శనానికి వెళ్లి మృతిచెందడంతో విలపిస్తున్నారు. కుటుంబానికి దిక్కెవరంటూ భార్య లక్ష్మీ బావురమంటోంది.
● అనాథగా మారిన కుటుంబం
మరుపల్లికి చెందిన బండారు రామచంద్రరావు మృతితో కుటుంబం అనాథగా మారింది. ఆయనకు భార్య సత్యవతితో పాటు తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీనివాస్, మూడేళ్ల పాప శ్రీసహిత ఉన్నారు.
● కూలీ కుటుంబంలో మృత్యుఘోష
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరడ రాము కూలిచేస్తేనే ఇల్లుగడిచే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అయ్యప్పస్వామిపై ఉన్న భక్తితో మాలధారణ చేశారు. ఇంటి పెద్ద దిక్కును మృత్యువు కాటేయడంతో భార్య పైడితల్లి, కుమారుడు ప్రసాద్, వృద్ధురాలైన తల్లి సింహాచలం విషాదంలో మునిగిపోయారు.
మృతి చెందిన అయ్యప్ప భక్తులు
అయ్యప్ప భక్తులను కాటేసిన మృత్యువు
తమిళనాడులోని రామేశ్వరంలో రోడ్డు ప్రమాదం
నలుగురు మృతి.. ఒకరికి తీవ్రగాయాలు
విషాదంలో కుటుంబ సభ్యులు
ఒక్కొక్కరుగా...
కె.కొత్తవలస నుంచి మొదటిసారి అయ్యప్ప మాల ధరించి శబరిమల వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మార్పిన అప్పలనాయుడు(31)కు మూడేళ్ల కిందటే మేనమామ కూతురు గాయత్రితో వివాహం జరిగింది. పిల్లల కోసం దైవసేవలో ఉండగా మృత్యువు కాటేయడంతో భార్య రోదిస్తోంది. అప్పలనాయుడు అక్క అప్పలనర్సమ్మ కూలి పనులకు వెళ్లి చైన్నెలో లారీ ఢీకొనడంతో మృతి చెందింది. మేనమామ గంజి త్రినాఽథ్ కొడుకు కూడా 2018 ఆర్మీకి ఎంపికై విశాఖపట్నంలో స్కూటీపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఇప్పుడు రెండు కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న అప్పలనాయుడు మృతితో తల్లిదండ్రులు రాములమ్మ, తిరుపతి, అత్త మామలు గంజి త్రినాథ్, లక్ష్మి కన్నీరుకార్చుతున్నారు.
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..
దైవదర్శనానికి వెళ్లి అనంతలోకాలకు..


