రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు | - | Sakshi
Sakshi News home page

రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు

Dec 7 2025 7:16 AM | Updated on Dec 7 2025 7:16 AM

రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు

రైతన్నను నట్టేట ముంచేసిన చంద్రబాబు సర్కారు

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

మజ్జి శ్రీనివాసరావు

బొబ్బిలి: విద్య, వైద్య రంగాలను ప్రైవేటుపరం చేయడం.. తన అనుయాయులకు ప్రభుత్వ భూములను కట్టబెట్టడంతో పాటు రైతన్నను సైతం చంద్రబాబు ప్రభుత్వం నట్టేటముంచుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. బొబ్బిలిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని వరి రైతుల నుంచి క్వింటా వద్ద 5 నుంచి 10 కిలోలు అదనంగా దోచుకుంటున్నా పాలకులు స్పందించకపోవడం విచారకరమన్నారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు నష్టపోయారన్నారు. ప్రజలను, రైతులను నిత్యం మోసగిస్తూ పోతే ఊరుకునేది లేదని, ప్రజా గొంతుకై నినదిస్తామని, వారి పక్షాన పోరాడతామన్నారు. అసమర్థ యంత్రాంగాన్ని రోడ్డుపై నిలబెడతామని హెచ్చరించారు. చెరకు పంటకు కర్మాగారం యాజమాన్యమే మద్దతు ధర నిర్ణయించడం దారుణమన్నారు. గతంలో జేసీ ఆధ్వర్యంలోని కమిటీ ధర నిర్ణయించేదని చెప్పారు. రైతుల పక్షాన జర్నలిస్టులు కూడా వెళ్లి క్షేత్ర పర్యటన చేసి సమస్యలు తెలుసుకోవాలన్నారు. విత్తన సరఫరాలో లోపాలున్నాయి.. విపత్తుల సమయంలో పరిహారాల్లేవు.. ఎరువు కష్టాలు వెంటాడుతున్నా పట్టించుకోవడం లేదు.. అన్నదాత సుఖీభవ రూ.20వేలకు రూ.10వేలు చేతిలో పెట్టారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో జిల్లాలోని 2.50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిందని, ఎరువులు, విత్తనాల సరఫరాతో ఉచిత పంటల బీమా పథకం వల్ల రైతులకు సకాలంలో పరిహారం అందిన విషయం గుర్తుచేశారు.

మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో అరటి, మామిడి, మొక్కజొన్న, పత్తి, ధాన్యం రైతులకు చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. మిల్లర్లు, ప్రభుత్వ యంత్రాంగం కుమ్మకై ్క ధాన్యం రైతుల నుంచి అదనంగా వసూలుచేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే బేబీనాయన రైతుల వద్ద ఒకలా, మిల్లర్ల వద్ద మరొకలా అదనపు ధాన్యం గురించి మాట్లాడడంతో వారు రైతులను లక్ష్యంగా చేసుకున్నారన్నారు. పల్లెలు, పట్టణాల్లో మద్యం ఏరులై పారుతోందని, బొబ్బిలి ఎమ్మెల్యేకు మద్యం బెల్ట్‌ షాపుల నుంచి ముడుపులు అందుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు ఇంటి గోపాలరావు, ఆర్థిక మండలి రాష్ట్ర మాజీ సభ్యుడు తూముల భాస్కరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement