రాజ్యాంగం స్ఫూర్తితో సాగుదాం
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా
అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజలందరి కోసం రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో ముందుకు సాగుదామని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం, చెప్పిన మాటలను ఆచరించడమే ఆయనకు మనమిచ్చిన ఘన నివాళిగా పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని విజయనగరంలోని జెడ్పీ కార్యాలయ ప్రాంగణంలో శనివారం నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ భారత దేశం ముద్దుబిడ్డ అని కొనియాడారు. మానవాళి ఉన్నంత వరకు తన ఆశయాల రూపంలో అంబేడ్కర్ సజీవంగా ఉంటారని గుర్తుచేశారు. దురదృష్టవశాత్తు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు బుంగ భానుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షుడు పతివాడ సత్యనారాయణ, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.


