ఉత్తరాంధ్ర సుజల స్రవంతి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో గ్రామాలవారీగా భూసేకరణ పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. అంచనా వ్యయం రూ.17,050 కోట్లతో ఉత్తరాంధ్రలో సుమారు 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుందని కలెక్టర్ తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 3.865 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టు నీరు అందనుందని పేర్కొన్నారు. ప్రాజెక్టును రెండు దశలుగా నిర్మిస్తున్నట్లు వివరిస్తూ రెండో దశలోని 6 ప్యాకేజీల్లో 1వ ప్యాకేజీలో కొంత భాగంతో పాటు 2, 4, 5, 6 ప్యాకేజీలు విజయనగరం జిల్లాలో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 9,630 ఎకరాలు సేకరించాల్సి ఉండగా కాలువల నిర్మాణం కోసం మాత్రమే 4,495 ఎకరాలు అవసరమని చెప్పారు. తక్షణ ప్రాధాన్యత మేరకు 339.68 ఎకరాలను వెంటనే సేకరించాలని రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై భూసేకరణకు సంబంధించి ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రాజెక్టు ఈఈ ఉమేష్ కుమార్, భూసేకరణ విభాగం ఎస్‌డీసీ కళావతి, చీపురుపల్లి ఆర్‌డీఓ సత్యవాణి, పలువురు డీఈలు, తహాసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు వేగవంతం చేయాలి
జిల్లాలో కొత్త పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులకు గడువుకోసం వేచి చూడకుండా వెంటనే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ శాఖ వద్ద దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నా వెంటనే సమన్వయం చేసుకుని క్లియరెన్స్ ఇప్పించాలని పరిశ్రమల శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు/ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలని ముందుకు వస్తున్న వారికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం, ఇన్సెంటివ్ మంజూరు, పీఎంఈజీపీ, ఏపీఐఐసీ అంశాలు, ర్యాంపు కార్యక్రమం తదితర అంశాలపై సమీక్ష జరిగింది. కొత్తగా ఏర్పాటు కానున్న 6 పరిశ్రమల ప్రగతిపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ డీడీ ఎంవీ కరుణాకర్, ఏపీఐఐసీ జెడ్‌ఎం మురళీమోహన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సరిత, అగ్నిమాపక అధికారి రాంప్రకాష్, నాబార్డ్ డీడీఎం నాగార్జున, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ ఎం.లక్ష్మణరావు, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య తదితర అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి


