సాయుధ దళాల నిధికి విరాళాలను అందించాలి
పార్వతీపురం: సాయుధ దళాల పతాక నిధికి విరివిగా విరాళాలను అందించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సాయుధ దళాల పతాక నిధి స్టిక్కర్స్, ఫ్లాగ్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత సైనిక దళాలు మొక్కవోని దీక్షతో చూపిన దేశభక్తి, సాహసం, త్యాగాల పట్ల దేశమంతా గర్విస్తుందన్నారు. దేశం కోసం ఎంతో మంది సైనిక సోదరులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రాణత్యాగం చేసిన అమరులు ఎంతో మంది ఉన్నారన్నారు. సైనికులకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నామని, వారి త్యాగాలకు ఎవరూ విలువ కట్టలేరన్నారు. పతాక నిధికి వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులు, పౌరులు, ఉద్యోగులు విరాళాలను అందించాలని కోరారు. ఈనెల 7న సాయుధ దళాల దినోత్సవం నిర్వహించుకోన్నట్లు తెలిపారు. విరాళాలను డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరున ఎస్‌బీఐ అకౌంట్ నంబర్ 33881128795, ఐఎఫ్‌ఐసీ కోడ్:ఎస్‌బీఐఎన్ 0016857కి అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓ హేమలత


