ఇది అంతం కాదు.. ఆరంభం..
విజయనగరం: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆరోగ్యమే పరమావధిగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడితే, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమంటూ విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ బాధ్యత గల ప్రతిపక్షంగా చేస్తున్న పోరాటం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని స్పష్టంచేశారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రైవేటీకరణ ఆలోచన విరమించుకునేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందన్నారు. ధర్మపురిలోని సిరిసహస్ర రైజింగ్ ప్యాలెస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుందని చెప్పారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50 వేల నుంచి 70వేల వరకు సంతకాలు సేకరణ జరిగిందన్నారు. గ్రామాలు, వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించిన పార్టీ శ్రేణులను ఆయన అభినందించారు. సేకరించిన సంతకాలను ఈ నెల 16న రాష్ట్ర గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు.
ప్రజా సమస్యలను పట్టించుకోని సర్కారు
2024 ఎన్నికలు అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టడం లేదని, వెలుగులోకి వస్తున్న సమస్యలను తమ అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయించి ప్రజలను మోసగించే ప్రయత్నం చేయడం దారుణమని జెడ్పీ చైర్మన్ అన్నారు. వలంటీర్, ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిందన్నారు. అంగన్‌వాడీ నిర్వహణ పూర్తిగా గాడితప్పిందన్నారు. రైతుల కష్టాలు పట్టించుకోవడంలేదని వాపోయారు. అన్నదాత సుఖీభవ అర్హులందరికీ అందని ద్రాక్షగా మారిందన్నారు. గడిచిన రెండేళ్లలో రూ.40వేలు ఇవ్వాల్సి ఉండగా... కేవలం రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ అలసత్వం రైతులకు శాపంగా మారిందన్నారు. స్వయానా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో 5 కేజీలు అదనంగా తీసుకుంటున్నారంటూ నేరుగా ఫిర్యాదు అందినట్టు చెప్పడం ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ లోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కె.వి.సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అల్లాడ సత్యనారాయణమూర్తి, గొర్లె రవికుమార్, పార్టీ జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పాండ్రంకి సంజీవరాజు, భోగాపురం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పాడ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
10న నియోజకవర్గం... 13న జిల్లా స్థాయిలో....
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రక్రియ ఈనెల 10న నియోజకవర్గ స్థాయిలో, 13న జిల్లా స్థాయిలో ముగుస్తుందని జెడ్పీ చైర్మన్ తెలిపారు. గ్రామ, మండల స్థాయిలో సేకరించిన సంతకాల పత్రాలను ఈ నెల 7,8 తేదీల్లో నియోజకవర్గ సమన్వయకర్తలకు అందజేయాలని సూచించారు. 13న సంతకాల పత్రాలతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని, ఇందులో నియోజకవర్గ సమన్వయకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ ప్రజావ్యతిరేకవిధానాలపై బాధ్యత గల ప్రతిపక్షంగా నిలదీస్తాం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
విరమించుకునేంతవరకు పోరాటం
సేకరించిన కోటి సంతకాలు ఈ 16న గవర్నర్‌కు అందజేత
10వ తేదీ నాటికి నియోజకవర
స్థాయిలో కార్యక్రమం ముగింపు
13న జిల్లాస్థాయిలో కోటి సంతకాల సేకరణ ముగింపు
అదే రోజున ప్రజల భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
మజ్జి శ్రీనివాసరావు


