ఆరోగ్యశ్రీకి తూట్లు..!
● ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకం పేరు చెరిపివేసే కుట్ర..!
● బీమా కంపెనీకి అప్పగించేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు సర్కారు
● దీనికోసం జీఓ 162 జారీ ● సిబ్బంది ఉద్యోగాలకు భద్రత కరువు
● బీమా కంపెనీ తరఫున అందించే వైద్య పరిమితి ఏడాదికి రూ.2.50 లక్షలే..
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ ఏడాదికి
రూ.25 లక్షల వరకు వైద్యం ● జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు 5,47 లక్షలు
విజయనగరం ఫోర్ట్:
చంద్రబాబు సర్కారు ఒక్కోపథకాన్ని అటకెక్కించేందుకు పూనుకుంది. ఇప్పటికే ఊరు/వార్డు ప్రజలకు సేవలందించే వలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేసింది. ఎండీయూ వ్యవస్థను రద్దుచేసి నిరుద్యోగులకు ఉపాధిని దూరం చేసింది. రైతన్నను ఆదుకునే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసింది. ఫ్యామిలీ డాక్టర్ సేవలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరును చెరిపేసి.. పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించే పథకానికి తూట్లు పొడిచేందుకు సిద్ధమైంది. వైద్య ఖర్చులను పరిమితం చేస్తూ... పథక నిర్వహణను బీమా కంపెనీకు అప్పగించేందుకు జీఓ 162ను జారీ చేసింది. దీనిపై పేద, మధ్యతరగతి ప్రజలు భగ్గుమంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు.
ఇదెక్కడి
అన్యాయం బాబూ..
ఆరోగ్యశ్రీ పథకం నిర్వహణ బాధ్యతలను బీమా కంపెనీకి అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జీఓ 162ను కూడా జారీ చేసింది. హైబ్రిడ్ మోడ్‌లో అమలు చేసేందుకు బీమా కంపెనీకి అప్పగించనున్నారు. బీమా కంపెనీ ద్వారా ఏడాదికి కేవలం రూ.2.50లక్షల విలువైన వైద్యసేవలనే అందిస్తారు. వైఎస్సార్ సీపీ ప్రభు త్వం ఆరోగ్యశ్రీ కార్డు కల్గిన వారికి ఏడాదికి రూ.25 లక్షల వరకు వైద్యం చేయించుకునే అవకాశం కల్పించింది. జిల్లాలో ఆరోగ్యశ్రీ కార్డులు కలిగి ఉన్న 5.44 లక్షల మందికి ఈ సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు బీమా కంపెనీ ద్వారా కేవలం రూ.2.50 లక్షల విలువైన వైద్యం అందించేందుకు పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉద్యోగులకు భద్రత కరువు...
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువు అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో ఆరోగ్య మిత్రలు, టీమ్ లీడర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు, జిల్లా మేనేజర్, జిల్లా కో ఆర్డినేటర్లు పనిచేస్తున్నారు. అయితే, ఆరోగ్య మిత్రలను మాత్రమే బీమా కంపెనీ తీసుకుంటుందని సమాచారం. మిగతా సిబ్బంది అంశంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 10 ప్రభుత్వాస్పత్రులు, 26 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
నాడు ఘనం..
ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరెడ్డి గుర్తుకు వస్తారు. అంతలా దేశ వ్యాప్తంగా పథకానికి గుర్తింపు వచ్చింది. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు కార్పొరేట్ ఆస్పత్రులు సైతం పిలిచి మరీ వైద్యం చేసేవి. వైఎస్సార్ తనయుడు జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సమర్ధవంతంగా నిర్వహించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేసుకున్న రోగులకు ఆరోగ్య ఆసరా పేరిట చికిత్స అనంతరం కోలుకునేందుకు వీలుగా భృతిని కూడా ఇచ్చారు. రోగి డిశ్చార్జ్ అయిన 48 గంటలలోగా రోగి బ్యాంకు ఖాతాకు డబ్బులు జమచేసేవారు. ప్రస్తుతం ఆరోగ్య ఆసరా అందడం లేదు. ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలు కూడా మృగ్యంగా మారాయి. ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో సేవలందడంలో జాప్యం జరుగుతోంది.
ఆరోగ్యశ్రీకి తూట్లు..!


