గిరిజనులను మోసం చేయొద్దు
కొత్తవలస:
గ్రేహౌండ్స్ పోలీస్ శిక్షణ కేంద్రం పేరుతో మరోమారు మా గిరిజనులను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమోరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు కోరారు. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ నిర్మిస్తామని మా భూములను లాక్కున్నారని, యువతకు ఉపాధి కల్పిస్తామని, భూమికి భూమి ఇస్తామని, ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మిస్తామని ఇలా ఏడు హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటులో భాగంగా తహసీల్దార్ పి.సునీత ఆధ్వర్యంలో శుక్రవారం అప్పన్నదొరపాలెంలో గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నుంచి అందించే పరిహారం, ప్రోత్సాహకాలను గిరిజనులకు తహసీల్దార్ వివరించారు. అనంతరం ఎమ్మెల్యే లలితకుమారి మాట్లాడుతూ గిరిజనులకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతో చేసిందని, గ్రేహౌండ్స్ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడంతో గిరిజన యువకులు ఆందోళనకు దిగారు. ఏళ్లు తరబడుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అంటూ నిలదీశారు. హామీలు నెరవేర్చాకే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గిరిజన యువత ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే లలితకుమారి సభ నుంచి వెళ్లిపోవడంపై యువకులు, మహిళలు అసహనం వ్యక్తంచేశారు. మా సమస్యలు తెలుసుకోవడం కూడా ఎమ్మెల్యేకు ఇష్టంలేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రం వచ్చి వరసలు కలుపుకొని ఓట్లు అడిగేందుకు వచ్చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అభిప్రాయం చెప్పుకునే ఆవకాశంలేని గ్రామసభ ఎందుకంటూ సభ నుంచి గిరిజనులు నిష్క్రమించారు. తహసీల్దార్ సునీత సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా గిరిజన యువకులు, మహిళలు వినిపించుకోలేదు. దీంతో అధికారులు వెనుదిరిగారు.
హామీలు నెరవేర్చాక పోలీస్ శిక్షణ కళాశాల నిర్మాణం చేపట్టండి
తేల్చిచెప్పిన గిరిజనులు
గిరిజనుల మాట వినకుండానే
వెళ్లిపోయిన ఎమ్మెల్యే
గిరిజనులను మోసం చేయొద్దు


