పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన ముమ్మరం
● ఈ నెల 6 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు
విజయనగరం అర్బన్: రైతుల అభివృద్ధికి గత 40 ఏళ్లుగా కృషి చేస్తున్న పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఏసీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నెల 6 నుంచి దశలవారీగా రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం స్థానిక అమర్ భవన్‌లో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యారావు, ప్రధాన కర్యాదర్శి బి.రామునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన అసోసియేషన్ జిల్లా గౌవర అధ్యక్షుడు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు మాట్లాడారు. రైతుల కోసం జీవితాంతం కష్టపడుతున్న పీఏసీఎస్ ఉద్యోగులకు న్యాయం జరిగేలా వెంటనే జీఓ నంబర్ 36 అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న మధ్యంతర భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీబీ పరిధిలోని 95 పీఏసీఎస్‌లలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ప్రతి ఉద్యోగికి కనీసం రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 2019 తర్వాత చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. దశలవారీ ఆందోళన షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఈనెల 6న నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు, 8న రాష్ట్రవ్యాప్తంగా డీసీసీబీ కార్యాలయాల వద్ద ధర్నా, 16న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతి పత్రం సమర్పణ, 22న డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, జనవరి 5న విజయవాడలో 26 జిల్లాల ఉద్యోగులతో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం విప్లవ నినాదాలు చేశారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ డి.నారాయణరావు, ట్రెజరర్ ఏవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.గిరిబాబు, ఆర్‌వీనాయుడు తదితరులు పాల్గొన్నారు.


