దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
విజయనగరం క్రైమ్: స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 23వ తేదీన జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి రూరల్ పోలీస్ స్టేషన్‌లో సీఐ లక్ష్మణరావు, ఎస్సై అశోక్‌లు గురువారం వివరాలు వెల్లడించారు. విశాఖకు చెందిన కోస్టుగార్డ్ మహేష్ కుమార్ తన ఫ్రెండ్‌ను కలవడానికి విజయనగరంలోని డెంకాడ వచ్చారు. కలిసిన అనంతరం స్కూటీపై డెంకాడ నుంచి రామనారాయణం వెళ్తుండగా పడాలపేట వద్ద కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి మహేష్ కుమార్‌ను అడ్డగించారు. తాము డీఎస్పీ సిబ్బంది అంటూ మహేష్‌కుమార్‌ను అడ్డగించి కారులో ఎక్కించి కొంతదూరం తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి మెడలో ఉన్న చైన్, ఉంగరం, రూ.10వేలు నగదు తీసుకుని ఖాళీ పేపర్‌పై సంతకాలు పెట్టించి రూ.20లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు. ఎలాగోలా వారి నుంచి మహేష్‌కుమార్ తప్పించుకుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈనెల 3వ తేదీన చెల్లూరు బైపాస్ రోడ్డులో కేవీఆర్ లే అవుట్ వద్ద కిలపర్తి నాగంనాయుడు(38), కొన్న రామకృష్ణ(43) బొడ్డ పరమేష్(26) నేలతేటి చిరంజీవి(25)లను అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు విజయనగరంలోని కుమ్మరివీధి, కొత్తపేట, గాజులరేగకు చెందిన వారు కాగా చిరంజీవి విశాఖలోని ఎంవీపీ కాలనీకి చెందిన వాడుగా సీఐ తెలిపారు. నిందితుల నుంచి మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.


