డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరంలోని శంకరమఠం వద్ద ఉన్న బీసీ సంక్షేమ హాస్టల్‌లో గురువారం ఓ డిగ్రీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. నగరంలోని ఎంఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కె.స్వాతి(17) ఆత్మహత్య సంఘటనపై సహచర విద్యార్థినులు, హాస్టల్ వార్డెన్, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన స్వాతి విజయనగరంలోని శంకరమఠం వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ఉంటూ డిగ్రీ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం తనసొంతూరుకు వెళ్లి మూడురోజుల క్రితం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడక పోవడం, నెమ్మదిగా ఉండడం చూసి సహచర విద్యార్థినులు కాస్త ఆందోళన చెందారు. కాలేజీకి వెళ్తూ వస్తోందే తప్ప ఎవరితోనూ మాట్లాడలేదు సహచర విద్యార్థిని మానసిక స్థితి చూసి తోటి విద్యార్థినులు వార్డెన్‌తో చెప్పి ఆస్పత్రికి తీసుకు వెళ్లమని సూచించారు. ఈ నేపథ్యంలో రూమ్‌లో తన వద్ద ఉన్న డైరీలో ఒక పేజీని చింపి అమ్మా.. నాన్న..నాకు బతకాలని లేదు.. నేను ఏ తప్పూ చేయలేదు. ఎందుకో నాకు భయమేస్తోంది. నేను బతకలేను’ అంటూ సూసైడ్ నోటు రాసి హాస్టల్‌లోనే తాను ఉంటున్న రూమ్‌లో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని తనువు చాలించింది. మధ్యాహ్నం భోజనానికి తోటి విద్యార్థినులు ఎంత పిలిచినా రాకపోవడంతో గట్టిగా తలుపు తట్టారు. దీంతో ఫ్యాన్‌కు వేలాడుతూ స్వాతి కనిపించడంతో హుటాహుటిన హాస్టల్ వార్డెన్‌కు చెప్పి స్వాతిని కిందికి దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టూటౌన్ సీఐ టి.శ్రీనివాసరావు, ఎస్సై కనకరాజు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని పిలిచి ప్రింగర్ ప్రింట్స్ తీయించారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య


