స్క్రబ్ టైఫస్‌పై అప్రమత్తతే ప్రధానం
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రస్తుతం స్క్రబ్‌టైఫస్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని, ఇతర జిల్లాల్లో కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి తెలిపారు. స్క్రబ్ టైఫస్ ఓరియాంటియా సుట్సుగామిషి బ్యాక్టీరియా వల్ల వస్తుందని, పొదలు, పంటచేలు, గడ్డి మైదానాల్లో ఉండే సంక్రమిత చిగర్ మైట్స్ కాటు వేయడం వల్ల వ్యాధి వ్యాప్తిస్తుందని తెలిపారు. అనుమానం ఉన్నవారు వెంటనే సమీప ప్రభుత్వాస్పత్రిని సంప్రదించాలని సూచించారు. ఆకస్మిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, అలసట, దద్దుర్లు, కాటువేసిన చోట నల్లటి పూతలా కనిపించే ఎస్కార్ గాయం వంటి లక్షణాలు స్క్రబ్ టైఫస్ వ్యాధికి చెందినవిగా పేర్కొన్నారు. డాక్సిసైక్లిన్ అత్యంత ప్రభావితమైన మందు అని, గర్భిణులు, చిన్న పిల్లల కోసం అజిత్రమైసిస్ వంటి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అంటూ ప్రజలను కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు భయపెడుతున్నట్టు ఫిర్యాదులు అందాయని, వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు.


