
ఆటోమేటిక్ కష్టాలు
రాజాం: ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే డ్రైవర్లకు కష్టాలు మొదలయ్యాయి. గతంలో ఏడాదికో, రెండేళ్లకు ఒకదఫా ఆటో డ్రైవర్లు, యజమానులు తమ ఆటోలను ఆర్‌టీఓ కార్యాలయం వద్ద తనిఖీలు చేయించి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు పొందేవారు. వాటికి తోడు గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ప్రతి ఏడాది ఠంచన్‌గా రూ.10 వేల సాయం అందించేది. వీటితో ఆటో వాలాలు ఇన్సూరెన్స్, ట్యాక్స్ చెల్లించుకునేందుకు అనుకూలంగా ఉండేది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సాయం కట్‌చేశారు. ఆటో డ్రైవర్లకు గత ఎన్నికల ముందు కూటమి నేతలు ఇచ్చిన జీఓలు, హామీలు అమలు కాలేదు. వాటికి తోడు అదనపు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అధిక ఫైన్‌లు, కొర్రీలతో ఆటోలు రోడ్డెక్కాలంటే భయపడుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ బస్సు వారిలో కొంతమంది పొట్టకొట్టే పరిస్థితి తెచ్చింది.
ఆ జీఓ ఎత్తివేత ఉత్తుత్తిదే
సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు రాకుండా చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలను తనిఖీచేసే జీఓ 21ను ఎత్తివేస్తామని, అవసరమైతే సవరిస్తామన్నారు. దీంతో పాటు ట్యాక్స్, ఇనూరెన్స్‌ల చెల్లింపుల్లో రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఎటువంటి ఫైన్‌లు ఉండవని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ జీఓ ఎత్తివేయకపోగా, కొత్త ఆంక్షలు మొదలయ్యాయి. రవాణా వాహనాల ఫిట్‌నెస్ టెస్టులకు సంబంధించి గత ప్రభుత్వమే నేరుగా నిర్వహించగా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆటోమేటిక్ టెస్టింగ్ పేరుతో పైవేట్ వారికి అప్పగించి, డ్రైవర్లపై అధిక భారం మోపడం ప్రారంభించింది. పైవేట్ ఏజెన్సీల చేతిలోకి ఫిట్‌నెస్ టెస్టింగ్ వెళ్లడం ద్వారా రవాణా వ్యవస్థ తారుమారవుతుందని, ఇప్పటికే అధిక ట్యాక్స్‌లు, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరల కారణంగా ఆటోలు నడపలేని పరిస్థితి ఎదురవుతోందని ఆటో కార్మికులు వాపోతున్నారు. గతంలో ఆటోవాలకు ఫైన్ నిమిత్తం రూ. 200లు, రూ.300లు ఉండేది. ఇప్పుడు చిన్నపాటి తప్పులను చూపించి రూ.1000లకు మించి ఫైన్‌లు వేస్తున్నారని ఆటోవాలా వాపోతున్నాడు. కూటమి వచ్చిన తరువాత తమకు ట్యాక్స్, ఇన్సూరెన్స్ తప్పుతాయని అనుకుంటే ఇప్పుడు డబుల్, త్రిబుల్ అవడమే కాకుండా అదనపు కేసులు పెడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు.
ఏదో ఒక నెపం
గతంలోకంటే ఇప్పుడు ఆటోవాలాకు విధిస్తున్న ఫైన్‌లు పెనుభారంగా మారాయి, ఆటోలు రోడ్డుమీద కనిపించినా, డ్రైవర్ సీటు పక్కన అదనంగా పాసింజర్లు ఉన్నా ఫైన్ పడుతుంది. ఇవి తనిఖీలు సమయంలో ఆటోవాలాకు తెలియడంలేదు. కొంతసమయం తర్వాత సెల్‌ఫోన్‌లకు మెస్సేజ్‌లు వస్తున్నాయి. దీంతో ఇదెక్కడి పరిస్థితిరా బాబూ అంటూ ఆటోడ్రైవర్లు మండిపడుతున్నారు. ఇటు రవాణా శాఖ అధికారులతో పాటు అటు పోలీసులతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ప్రారంభమ య్యాయి. పార్కింగ్ పేరుతో అధిక ఫైన్‌లు పడుతుండడం శోచనీయం. మరో వైపు వాహన మిత్ర అందకపోవడం దురదృష్టకరంగా మారింది. రాజాం నియోజకవర్గంలో రాజాం నుంచి రేగిడి, వంగర, సంతకవిటి, చీపురుపల్లి, తెర్లాం, పొందూరు, జి,సిగడాం ఏరియాలకు ప్రతిరోజూ 1400 ఆటోలు తిరుతుంటాయి. వారందరికీ గతంలో వచ్చే వాహన మిత్ర అటకెక్కింది.
ఎప్పటికప్పుడే వాహనాల తనిఖీ చేస్తున్న అధికారులు
అటు రవాణా, ఇటు సివిల్ పోలీస్ అధికారులతో ఇబ్బందులు
అవిలేవు..ఇవి లేవంటూ ఫైన్‌లు
ఆందోళనలో డ్రైవర్లు
చాలా ఇబ్బందిగా ఉంది
గతంలో కంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రోడ్డు ట్యాక్స్ పెంచారు. ఇన్సూరెన్స్ చార్జీలకు అదనంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. వాటితో పాటు పొల్యూషన్ చార్జీలు, ఇతర ఫైన్‌లు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కంటే ఎక్కడికక్కడే వాహన చెకింగ్‌లు పెరిగిపోయాయి. పాత బకాయిలు అంటూ, మత్తు పదార్థాల రవాణా తనిఖీలు, డ్రంకెన్ డ్రైవ్ పేరుతో అధికారులు నిత్యం తనిఖీచేసి, ఆటోకు సంబంధించి ఏ చిన్నకాగితం లేకున్నా, ఎక్కువమంది ప్రయాణికులు ఉన్నా అపరాద రుసుం విధిస్తున్నారు. ఆటోతో రోడ్డు ఎక్కాలంటే భయమేస్తోంది. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని సవరిస్తామని చెప్పి, ఇంతవరకూ సవరించలేదు.
ఎన్. దుర్గారావు, అమ్మానవదుర్గ
ఆటోయూనియన్ నాయకుడు, రాజాం
కష్టం ఎక్కువ..ఆదాయం తక్కువ
గతంలో ఆటోలు నడిపితే కుటుంబాన్ని అవలీలగా పోషించుకున వారం. ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్దగా బేరాలు ఉండడంలేదు. లాంగ్ జర్నీ బేరాలు వస్తే హైవే ఎక్కాలంటే భయమేస్తోంది. ట్యాక్స్, ఇతర కాగితాలు పేరుతో ఫైన్‌లు పడుతున్నాయి. తనిఖీ అధికారులతో మాట్లాడినసమయంలో ఏమీ ఉండడంలేదు. అనంతరం సెల్‌ఫోన్‌లకు మెస్సేజ్‌లు వస్తున్నాయి. రాంగ్ పార్కింగ్ అని, ఎక్కువ మంది ఉన్నారని ఇలా తప్పులు చూపిస్తున్నారు. వీటికి తోడు ట్యాక్స్, ఇన్సూరెన్స్ చెల్లింపులు పెరిగాయి. జీఓ నంబర్ 21లో సవరణ లేకపోవడంతో ఆటోలకు నిత్యం తనిఖీలు, ఇబ్బందులు పెరిగాయి.
వి. మజ్జిగౌరి, ఆటో డ్రైవర్, రాజాం

ఆటోమేటిక్ కష్టాలు

ఆటోమేటిక్ కష్టాలు

ఆటోమేటిక్ కష్టాలు

ఆటోమేటిక్ కష్టాలు