
సమాజం అభివృద్ధికి జర్నలిస్టుల బాధ్యత కీలకం
విజయనగరం గంటస్తంభం: సమాజంలో జరుగుతున్న మంచి, చెడును వెలికి తీసి అభివృద్ధికి దోహదపడే పవిత్ర వృత్తిలో జర్నలిజం కీలకంగా నిలుస్తుందని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్‌స్ (ఏపీయూడబ్ల్యూజే) 68వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్, ఏటీకే వ్యవస్థాపకుడు డా.ఖలీల్‌బాబా జ్యోతి ప్రజ్వలన చేశారు. తొలుత స్వర్గీయ గురజాడ అప్పారావు, సర్ సీవైచింతామణి, మానుకొండ చలపతిరావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇళ్ల స్థలాలు లేని జర్నలిస్టులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే అందరూ ఏక తాటిపై నిలిచి ఒకే జాబితా ఇస్తే అర్హులందరికీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నారు. ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టులను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వృత్తిలో ఉన్న జర్నలిస్టుల వాహనాలకు క్యూఆర్ కోడ్‌తో ఉన్న స్టిక్కరింగ్ వ్యవస్థను సుమారు 15 నుంచి 20 రోజుల్లో తీసుకొస్తామన్నారు. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పీఎస్‌ఎస్‌వీ శివప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ జీవనానికి సరిపడ ఆదాయం లేనప్పటికీ జర్నలిజం వృత్తినే నమ్ముకున్న జర్నలిస్టు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
సీనియర్ జర్నలిస్టులకు సత్కారం
అనంతరం జిల్లాలో 25 ఏళ్లపాటు జర్నలిజం వృత్తిలో ఉన్న 40 మంది సంఘం సభ్యులను సంఘం జ్ఞాపికలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు మహాపాత్రో అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎంఎస్‌ఎన్‌రాజు, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పంచాది అప్పారావు, ఆరిపాక రాము, చిన్న పత్రికల సంఘం జిల్లా అధ్యక్షుడు కేజేశర్మ, కార్యదర్శి సముద్రాల నాగరాజు, సీనియర్ జర్నలిస్టులు ఎలిశెట్టి సురేష్, డేవిడ్ రాజు, చక్రవర్తి, వేదుల సత్యనారాయణ, జె.శేషగిరి, జయరాజ్, లింగాల నర్శింగరావు, మంత్రి ప్రగడ రవి, శంకరావు, గోవింద తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 68వ ఆవిర్భావ దినోత్సవం