
తమ్ముడిని రక్షించి..అన్న అనంతలోకాలకు..
పాలకొండ రూరల్: బంధువుల ఇంట గృహప్రవేశానికి ఎంతో సంతోషంతో వచ్చిన ఓ కుటుంబంలో నాగావళి నది తీరని శోకం మిగిల్చింది. గ్రామంలో శుభకార్యం కావడంతో అంతా సందడిగా ఉండగా కొద్ది క్షణాల్లో తీవ్రవిషాదం గ్రామాన్ని నిశ్శబ్దంలోనికి నెట్టేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నవంపాడు గ్రామానికి చెందిన ద్వారంపూడి రవి, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు పవన్ (16), భార్గవ్‌సాయి ఉన్నారు. ఆ కుటుంబం పాలకొండ మండలంలోని అన్నవరం గ్రామాంలో వారి దగ్గర బంధువు పైడితల్లి, రామారావుల నూతన గృహ ప్రవేశానికి శనివారం వచ్చింది. ఆదివారం గృహప్రవేశం కావడంతో పవన్‌కుమార్ తమ్ముడు భార్గవ్‌తో పాటు బాబాయి సురేష్‌తో కలిసి ద్విచక్రవాహనంపై గ్రామ సమీపంలో ఉన్న నాగావళి తీరానికి ఉదయం 6.30గంటల సమయంలో వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాబాయి బహిర్భూమికి వెళ్లగా భార్గవ్‌సాయి స్నానం చేసేందుకు నదిలో దిగాడు. లోతు ఎక్కువగా ఉండడం, ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో మునిగి పోయాడు. ఈ విషయం గమనించిన పవన్‌కుమార్ తన తమ్ముడిని రక్షించేందుకు నదిలోకి దిగాడు. తమ్ముడిని ఒడ్డుకు చేర్చే యత్నం చేశాడు. తమ్ముడు మునిగిపోతున్నట్లు గట్టిగా అరవడంతో సమీపంలో ఉన్న బాబాయి భార్గవ్ సాయి రెక్క పట్టుకుని బడ్డుకు లాగాడు. ఇంతలో పవన్‌కుమార్ మునిగిపోయాడు. విషయం గుర్తించిన స్థానికులు తక్షణమే స్పందించి మునిగిపోయిన పవన్‌కుమార్‌ను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న పవన్‌కుమార్‌కు సీపీఆర్ చేసి ప్రథమ చికిత్స అందించేందుకు తీసుకు వెళ్లేయత్నం చేస్తుండగా మృతిచెందాడు.
విశాఖలో చదువుతున్న అన్నదమ్ములు
మృతుడి తండ్రి రవి భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కల కష్టంతో కుమారులను విశాఖలో చదివిస్తున్నాడు. పవన్‌కుమార్ బైపీసీ ప్రథమ సంవత్సరం చదువుతుండగా రెండవ కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. చేతికి అందివస్తున్న పెద్దకుమారుడు ఇలా ప్రమాదంలో మరణించడంతో భార్య వసంత, రవి గుండెలు పగిలేలా రోదించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాధాకృష్ణమూర్తి, ఎస్సై కె.ప్రయోగమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిపై ఆరా తీశారు. తల్లితండ్రులు కుమారుడి మృతదేహాన్ని వారి స్వగ్రామం తీసుకువెళ్లారు.
నాగావళి నదిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

తమ్ముడిని రక్షించి..అన్న అనంతలోకాలకు..