
దోమకాటు.. ప్రాణాంతకం
పార్వతీపురం రూరల్: ప్రతి వ్యాధికి ప్రస్తుత కాలంలో దోమకాటే మూల కారణమవుతుందని వైద్యులు, పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు దోమ ఎంత ప్రమాదకరమైందో, దోమలతో సోకే వ్యాధుల గురించి తెలుసుకుందాం. దోమకాటు చాలా ప్రమాదం. లేనిపోని రోగాలన్నీ దోమల ద్వారానే వస్తున్నాయని అనేక అధ్యయనాలు తెలిపాయి.
దోమకాటుతో వచ్చే వ్యాధులు–లక్షణాలు
మలేరియా: ఆడ అనాఫిలస్ దోమ కుట్టడంతో మలేరియా వ్యాధి సోకుతుంది.
లక్షణాలు: చలి, వణుకుతో జ్వరం రావడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, జ్వరం విడిచి విడిచి వస్తూ ఉంటుంది.
డెంగీ: పగటి సమయంలో కుట్టే ఏడిస్ ఆడ దోమల ద్వారా డెంగీ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది సాధారణ వైరల్ జ్వరంగా ఎముకలు, కండరాలు, కీళ్లనొప్పులతో మొదలవుతుంది. ప్లేట్‌లెట్స్ అమాంతం తగ్గిపోతాయి.
లక్షణాలు: హఠాత్తుగా తీవ్ర జ్వరం రావడం, కదలలేని స్థితి, ఎముకలు, కండరాలలో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రని దద్దుర్లు, వాంతులు, వికారం, నోరు ఎండిపోవడంతో పాటు చిగుళ్లు, ముక్కు ద్వారా రక్తం వస్తుంది.
చికున్ గున్యా: ఏడిస్ ఈజిప్ట్ దోమలతో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చేతులు, కాళ్లలో, కీళ్లలో వాపు వచ్చి కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. జ్వరంతో మనిషి బలహీనంగా ఉంటాడు.
లక్షణాలు: తలనొప్పి, వాంతులు, వికారంతోపాటు హఠాత్తుగా జ్వరం, కీళ్ల నొప్పులు, సరిగా నిలబడలేకపోవడం.
ఫైలేరియా: దీనిని బోదకాలు అని కూడా అంటారు. క్యూలెక్స్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శరీరంలోని ఏ భాగానికై నా బోదకాలు సోకుతుంది. తరచూ జ్వరం, చంకల్లో, గజ్జల్లో బిళ్లలు కట్టడం, వెన్ను పాము దగ్గర నుంచి అన్ని అవయవాలపై ప్రభావం చూపుతుంది. అవయవాలకు వాపు, కాళ్లు, చేతులు, స్తనాలు, వరిబీజం, జ్ఞానేంద్రియాలు పాడవుతాయి.
మెదడువాపు
క్యూలెక్స్ ఆడదోమ కుట్టడంతో వ్యాధి సంక్రమిస్తుంది. ఎక్కువగా 2 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది.
లక్షణాలు: ఆకస్మిక జ్వరం వచ్చి తీవ్రత ఎక్కువ కావడం, విపరీతమైన తలనొప్పి, వాంతులు రావడం, అపస్మారక స్థితికి లోనుకావడం, శరీరంలో ఏదో ఒకపక్క పక్షవాతానికి గురికావడం, ఫిట్స్ రావడం.
నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ముప్పు
నీటి నిల్వలతోనే ప్రమాదం
వారం పదిరోజుల వ్యవధిలో పరిసరాల్లో కాని, ఇంట్లో ఉన్న నీటి నిల్వల్లో మలేరియా దోమలు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఇంట్లో ఉన్న కూలర్లు, చల్లదనం కోసం వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో వాటి ద్వారా వచ్చిన నీటి నిల్వల్లో డెంగీదోమ వ్యాప్తి చెందుతుంది. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటికే 915 మలేరియా ప్రభావిత గ్రామాల్లో మొదటి, రెండవ విడతలో స్ప్రేయింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. ప్రజలు జ్వరాలు బారిన పడినపుడు కచ్చితంగా నిర్లక్ష్యం వహించకుండా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం వైద్యుల సూచనలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి.
– డా.తెర్లి జగన్‌మోహన్‌రావు,
జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రాం అధికారి
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
డెంగీ, చికున్ గున్యా, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను నివారించాలంటే వైద్యం ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే తప్ప దోమల నియంత్రణ పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఎవరికి వారు ఇంటి లోపల దోమలు లేకుండా చూసుకోవడమే మంచిమార్గం.
దోమతెర: రాత్రిలో పడుకునే ముందు దోమతెర వాడాలి. లేదంటే శరీరం పూర్తిగా కప్పబడేలా దుస్తులు వేసుకోవాలి.
వేపనూనె: వేపనూనె, కొబ్బరినూనెను 1:1 నిష్పత్తిలో తీసుకుని చర్మంపై రాసుకోవాలి. వేప వాసన చూసి దోమలు పారిపోతాయి.
నిమ్మనూనె: దోమల నివారణకు యూకలిప్టస్, లెమన్ ఆయిల్‌ను చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల మన చర్మానికి ఎలాంటిహాని ఉండదు.
కర్పూరం: చీకటి పడుతున్న వేళలో ఇంటి తలుపులు మూసేసి కర్పూరం వెలిగించి 20 నిమిషాల తర్వాత తలుపు తెరిస్తే దోమలు కనిపించవు. కర్పూరం మంచి కీటక నివారిణిగా పనిచేస్తుంది.

దోమకాటు.. ప్రాణాంతకం