
పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు
● గ్రామాల్లో కొనసాగుతున్న సంప్రదాయం
వేపాడ: పూర్వీకుల సంప్రదాయాలను పల్లెల్లో నేటికి ఆచరిస్తూ ఉండడంతో నేటి తరానికి సంప్రదాయాలు, ఆచారాలు తెలుస్తాయని పెద్దలు అంటున్నారు. వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో ఆదివారం జరిగిన వివాహం సందర్భంగా పెళ్లికూతురును వేపాడ, వల్లంపూడి జంట గ్రామాల్లో పల్లకిలో ఊరేగించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. శ్రావణమాసంలో ఆఖరు ముహుర్తం కావడంతో పెద్దసంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయి. మరో 30రోజుల పాటు వివాహాలకు శూన్యమాసం రావడంతో ముహుర్తాలు లేవని పండితులు చెబుతున్నారు.
రెడ్డివానివలసలో కార్డన్‌సెర్చ్
మెంటాడ: నాటుతుపాకుల ఏరివేతలో భాగంగా మెంటాడ మండలం కొండలింగాలవలస పంచాయతీ మధుర గ్రామం రెడ్డివానివలసలో సీఐ జీఏవీ రమణ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ –సెర్చ్ ఆపరేషన్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సోదా చేశారు. సోదాల్లో భాగంగా 70లీటర్ల సారా, 1000 లీటర్ల మడ్డి కల్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కె.సీతారాం తెలిపారు.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
రామభద్రపురం: మండలకేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీరాంనగర్ కాలనీకి చెందిన రమేష్ కడుపునొప్పితో బాధపడుతున్నాడు.రోజూలాగానే పొలంలో పనిచేస్తుండగా కడుపులో నొప్పి రావడంతో ఈ నెల 15వ తేదీన గడ్డిమందు తాగేశాడు. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు బాడంగి సీహెచ్‌సీలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 16న రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సై వి.ప్రసాదరావు కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
నాగావళి నదిలో వ్యక్తి గల్లంతు
సంతకవిటి: మండలంలోని పోడలి గ్రామానికి చెందిన ఉరదండం పోలయ్య(76) ఆదివారం నాగావళి నదిలో గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎప్పటిలాగానే ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నాగావళి నదికి వెళ్లాడు. ఎప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో నది దగ్గరికి వెళ్లి చూడగా నది వద్ద దుప్పటి, చెప్పులు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్సై ఆర్.గోపాలరావు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. అలాగే సంఘటన స్థలాన్ని తహసీల్దార్ బి.సుదర్శనరావు ఆధ్వర్యంలో ఆర్‌ఐ కృపారావు, వీఆర్‌ఓ అన్నారావులు పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టేందుకు వీలు లేకుండా నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో కలెక్టర్ దృష్టిలో పెట్టామని, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం వచ్చిన వెంటనే గాలిస్తామని తెలిపారు. పోలయ్య అల్లుడు ఎ.చిన్నారావు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు

పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు

పల్లకిలో పెళ్లికూతురి ఊరేగింపు