
చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర నిఘా
విజయనగరం అర్బన్: జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా పెడుతూ విస్తృతంగా దాడులు చేస్తున్నామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చట్ట విరుద్ధ చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూదం, కోడి–గొర్రె పందాలు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తరచూ పట్టుబడుతున్న నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లే–అవుట్లు, గ్రామ శివారు, నగర శివారు, తోటలు, పాడుబడిన భవనాల్లో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రమంలో డ్రోన్ల సహాయం తీసుకుంటున్నామని వివరించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ముందుగానే సమాచారం సేకరించి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పేకాట విషయంలో 1,031 మందిపై 141 కేసులు నమోదు చేసి రూ.24,07,398 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కోడి పందాల విషయంలో 174 మందిపై 35 కేసులు, రూ.1,13,679 నగదు, 75 కోళ్లు, 4 పొట్టేళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెపారు. మహిళా పోలీసుల ద్వారా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి చట్టవిరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అసాంఘిక కార్యకలాపాలపై ఏమైనా సమాచారం తెలిసినా స్థానిక పోలీసులకు లేదా డయల్ 112/100కు అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ వకుల్ జిందల్