
గడువు దాటినా పరిష్కరించకపోతే చర్యలు
విజయనగరం అర్బన్: ప్రజా వినతుల పరిషార వేదికకు వచ్చే వినతులను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించని జిల్లా అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ ప్రజల నుంచి 149 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజూ లాగిన్‌లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని సూచించారు. నిర్దేశించిన గడువులోగా పరిష్కరించడానికే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పుడు చూసినా పరిష్కారాల నమోదు సున్నా కనబడాలని తెలియజేశారు. ప్రతి రీ ఓపెన్ కేసును పూర్తిగా విచారణ జరిపి పరిష్కార మార్గం చూడాలని సూచించారు. గడువులోగానే వినతులకు సమాధానాలు పంపాలని అలా చేయని అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అర్జీల స్వీకరణలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, విజయనగరం డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వరరావు, ప్రమీల గాంధీ పాల్గొన్నారు.
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 37 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు’ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టం) కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందల్ సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని,వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ 37 ఫిర్యాదులను స్వీకరించారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, ఏడు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
పీజీఆర్‌ఎస్‌కు 149 వినతులు

గడువు దాటినా పరిష్కరించకపోతే చర్యలు