
కొత్తవలసలో మరో చోరీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టులో సుమారు 5 కేజీల బంగారం, పెద్ద మొత్తంలో నగదును దొంగలు దోచుకుపోయిన విషయం మరవక ముందే మరో ఇంటిలో పడి పెద్ద ఎత్తున బంగారం, వెండి, నగదును దోచుకుపోయారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో వరుస దొంగతనాలు కొత్తవలస పోలీసులకు తలనొప్పిగా మారింది. ఘటన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో గల విద్యుత్ సబ్‌స్టేషన్ సమీప బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్న ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మోపాడ కృష్ణంనాయుడి ఇంటిలో శనివారం రాత్రి దొంగలు పడి 15 తులాల బంగారం, 50 తులాల వివిధ రకాల వెండిసామగ్రి, ఆయన కుమారుడి కళాశాల ఫీజు కట్టేందుకు దాచుకున్న రూ.లక్షా 50వేల నగదు దోచుకుపోయారు. కృష్ణంనాయుడు శనివారం రాఖీ పండగ సందర్భంగా ఎస్.కోటలో గల తన స్వగ్రామానికి కుటుంబంతో సహా వెళ్లారు.అదే రోజు సమీప బంధువైన ఓ వృద్ధురాలు మృతి చెందింది. దీంతో అంత్యక్రియల్లో పాల్గొని శనివారం రాత్రి ఎస్.కోటలోనే ఉండిపోయారు. మరుసటి రోజు ఆదివారం సాయంత్రం కొత్తవలసలో గల ఇంటికి కుటుంబంతో సహా వచ్చేసరికి ఇంటి ఇనుప కటకటాలకు సబంధించిన గడియలను కోసి ఇంటిలోకి దొంగలు చొరబడి ఇంట్లోని సామాన్లు, బీరువాలో బట్టలను చిందర వదంగా పడేశారు. అన్నీ పరిశీలించగా బంగారం, వెండి, నగదు పోయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సోమవారం విజయనగరం నుంచి క్లూస్‌టీమ్ వచ్చి ఘటనా స్థలంలో పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. బాధితుడు కృష్ణంనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
15 తులాల బంగారం, 50 తులాల వెండి,
రూ.లక్షా 50వేల నగదు దోచుకున్న దొంగలు
పోలీసులకు తలనొప్పిగా మారిన వరుస దొంగతనాలు