
మేనమామను కడతేర్చిన మేనల్లుడు
బొండపల్లి: మండలంలోని కెరటాం గ్రామానికి చెందిన వ్యక్తిని సొంత మేనల్లుడు చంపి ఆ తరువాత సహజంగానే చనిపోయినట్లు అందరినీ నమ్మించి దహనసంస్కారాలు నిర్వహించాడు. ఈ విషయంపై 100కు సమాచారం అందడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమవారం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నీడిగేటి అప్పల కృష్ణ (42), మేనల్లుడు నారపాటి సాయి శనివారం మద్యం తాగడానికి గ్రామం బయటకు వెళ్లారు. అక్కడే మద్యం మత్తులో మేనమామ కృష్ణను సాయి హత్య చేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వచ్చేశాడు. మేనమామ ఏడని, ఇద్దరు కలిసి వెళ్లి ఒక్కడివే వచ్చావని మృతుడి భార్య అడగ్గా మద్యం ఎక్కువై పడుకున్నాడని సమాధానం చెప్పాడు. కొద్దిసేపటి తరువాత మృతుడు కృష్ణను సాయి బైక్‌పై తీసుకు వచ్చి చలనం లేదని, చనిపోయి ఉంటాడని అందరిరినీ నమ్మించే ప్రయత్నం చేసి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. శవాన్ని వారి ఆచారం ప్రకారం పూడ్చిపెట్టారు. కార్యక్రమం అనంతరం సాయి విశాఖపట్నంలోని గోపాలపట్నం వెళ్లి పోయాడు. మృతుడు కృష్ణ సొంత చెల్లెలి కొడుకు సాయి కాగా కొంతకాలంగా వారు గోపాలపట్నంలో ఉంటున్నారు. తరచూ సాయి మేనమామ ఇంటికి వస్తూ పోతుంటాడు. ఈ క్రమంలోనే శనివారం వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ చనిపోవడం పట్ల పోలీసులకు 100కాల్ రావడంతో సోమవారం రంగంలోకి దిగారు. శవాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి తహసీల్దార్ డోలా రాజేశ్వరావుతో పాటు ఎస్సై యు.మహేష్ వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం విజయనగరంలోని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
వివాహేతర సంబంధమే హత్యకు కారణమా?
మృతుడి భార్య రాజుతో మేనల్లుడు సాయికి కొన్ని సంవత్సరాలనుంచి వివాహేతర సంబంధం ఉందని ఈ విషయంపై మేనమామతో సాయికి గొడవ జరిగి హత్యకు దారి తీసిఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉండగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడు.

మేనమామను కడతేర్చిన మేనల్లుడు