అవి దేవస్థానం భూములే..
● స్పందించిన జాయింట్ కలెక్టర్
● రెవెన్యూ అధికారుల పరిశీలన
● నీలకంఠేశ్వస్వామి దేవస్థానం భూములేనని నిర్ధారణ
చీపురుపల్లి: నీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూము ల్లో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ‘దేవుడి భూము ల్లో అక్రమ కట్టడాలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన కథనంపై జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ స్పందించారు. తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆర్డీఓ సత్యవాణిను ఆదేశించారు. ఆర్డీఓ సూచనల మేరకు చీపురుపల్లి ఇన్‌చార్జి తహసీల్దార్ కె.సూర్యకాంతం, మండల సర్వేయర్ శ్రీనివాస్, వీఆర్వో భవానీ, చీపురుపల్లి పట్టణ సర్వేయర్ కాళీ, దేవదాయశాఖ సిబ్బంది మణికంఠ తదితరులు చీపురుపల్లి పట్టణంలోని శ్రీ ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానం భూములను సోమ వారం పరిశీలించారు. ఆ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి తహసీల్దార్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 135లో 18.86 ఎకరాల భూమి ఉమానీలకంఠేశ్వరస్వామి దేవస్థానానికి చెందినవేనని నిర్ధారించామని చెప్పారు. ఇదే విషయాన్ని నివేదిక సిద్ధంచేసి ఆర్డీఓకు అందజేస్తామని స్పష్టంచేశారు. అదే సర్వే నంబర్‌లో చాలా ఇళ్ల నిర్మాణాలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాజాం రోడ్డులోని బంగారమ్మకాలనీలో సర్వేనంబర్ 209–6లో శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానానికి చెందిన భూముల్లో ఆక్రమణలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదులు మేరకు ఆ భూములను కూడా పరిశీలించినట్టు చెప్పారు. రికార్డుల పరంగా ఆ భూములు కూడా దేవస్థానానికి చెందినవేనని, అక్కడ ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరపరాదని నివేదిక అందజేస్తామని తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు
విజయనగరం అర్బన్: పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు మంజూరు చేయాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతుమాధవన్ మాట్లాడుతూ.. సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. గత మూడు నెలల్లో పరిశ్రమల స్థాపనకు 149 దరఖాస్తులు రాగా.. వీటిలో ఇప్పటివరకు 138 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని చెప్పారు. చేతి వృత్తిదారులకు చేయూత నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అమలు చేస్తోందని.. ఈక్రమంలో వీలైనంత వేగంగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు. విశ్వకర్మ యోజన పథకానికి 86,386 దరఖాస్తులు రాగా.. మూడు దశల్లో వాటిని పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 1,080 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేయడం పట్ల ఇన్‌చార్జ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జీఎం శ్రీధర్, సహాయ సంచాలకుడు బి.రామకృష్ణ, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
12 నుంచి ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
విజయనగరం అర్బన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. పరీక్షల కన్వీనర్, రీజనల్ ఇన్‌స్పెక్షన్ అధికారి ఎస్.తవిటినాయుడు మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు సుమారు 15,000 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 6,000 మంది విద్యార్థులు హాజరుకాన్నారని తెలిపారు. ఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు పాల్గొన్నారు.
అవి దేవస్థానం భూములే..
అవి దేవస్థానం భూములే..


