వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
గంట్యాడ: మండలంలోని నరవ గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు గేదెల రామారావు (60) వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఎప్పటి లాగా శుక్రవారం కూడా గ్రామంలోని డెంకాడ చెరువులో జరుగుతున్న ఉపాధిహామీ పనికి వెళ్లాడు. ఉదయం 9.30 గంటల సమయంలో సొమ్మసిల్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో తోటి వేతనదారులు చికిత్స కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకుని వెళ్లిపోయారు.
విద్యుత్ షాక్‌తో యువకుడు..
గుమ్మలక్ష్మీపురం(కురుపాం): తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో విద్యుత్ షాక్ తగిలి కురుపాం మండలం నీలకంఠాపురం పంచాయతీ డంగులగూడ గ్రామానికి చెందిన బిడ్డిక ప్రశాంత్(23) మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రశాంత్ గోపాలపురంలోని ఓ రొయ్యిల చెరువులో కొన్నేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం చెరువులోని పనికి వవెళ్లగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడంటూ..ఫోన్ ద్వారా రొయ్యిల చెరువులో పనిచేస్తున్న సహచర కూలీలు, రొయ్యల చెరువు యజమాని సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు తెలియజేశారు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు వెంటనే గోపాలపురం పయనమయ్యారు.
లారీ ఢీకొని వ్యక్తి..
సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇటుక బట్టీ వద్ద శుక్రవారం లారీ ఢీకొట్టడంతో ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. దత్తిరాజేరు మండలం, పెదకాద గ్రామానికి చెందిన గంగవరపు సత్యం(50)సీతానగరం కుమ్మరివీధిలో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కుటుంబసభ్యులు, సమీపబంధువుల ఆధ్వర్యంలో తామరఖండిలో నిర్వహిస్తున్న ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. ఒడిశా నుంచి యాష్ లారీ ఇటుకల బట్టీలో అన్‌లోడ్ చేయడానికి వచ్చింది. అన్‌లోడ్ చేయడానికి ఇటుకబట్టీని ఆనుకుని లారీ వెనక్కి మళ్లిస్తుండగా మధ్యలో ఉన్న గంగవరపు సత్యం ఇరుక్కుపోవడంతో ప్రమాదం జరిగి గాయాలపాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించి కేసునమోదు చేసినట్లు తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి


