అతిథులారా.. రారండోయ్!
ప్రయాణ కష్టాలు
సాక్షి, పార్వతీపురం మన్యం/ విజయనగరం అర్బన్:
అయిపోయిన పెళ్లికి కూటమి నాయకత్వం మళ్లీ భజంత్రీలు వాయిస్తోంది. సంక్షేమ పథకాలకు తూట్లు పొడిచి... ఆ మొత్తాలను తమ ప్రచారాలకు, ఆర్భాటాలకు ఖర్చు చేస్తోంది. కేవలం గ్రాఫిక్ హంగులతో కూడిన అమరావతి నిర్మాణాలు చేపట్టిన బాబు సర్కారు.. నేడు మరోమారు పునఃప్రారంభ కార్యక్రమాల పేరిట ప్రజా ధనం రూ.కోట్లు వెచ్చిస్తోంది. అప్పట్లో ప్రారంభో త్సవానికి ప్రధాని మోదీ రాకను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజలను అవస్థలకు గురి చేశారు. వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తోపాటు పలు శాఖల పరిధిలో మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి వేతనదారులను, దిగువస్థాయి సిబ్బందిని అమరావతి తరలించారు. దీనికోసం రూ.కోట్లు ఖర్చు చేశారు. తాజాగా మరోమారు ఈ తరహా చర్యలకు తెర తీశారు. అమరావతి రాజధాని పునఃనిర్మాణమంటూ కూటమి ప్రభుత్వం మరోసారి హడావిడి చేస్తుండగా.. అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేపట్టాలని కూటమి ఎమ్మెల్యేలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వారేమో అధికారులకు ‘టార్గెట్’లు ఇచ్చారు. ఎక్కువగా మహిళలే ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే కార్యక్రమానికి ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి పెద్ద ఎత్తున జనాలను గుంటూరు జిల్లా అమరావతికి తరలించారు. ఇందుకోసం ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను వినియోగించారు.
విజయనగరం నుంచి తరలిన బస్సులు
విజయనగరం జిల్లా పరిధిలోని ఎస్.కోట, విజయనగరం డిపోల 43 బస్సులు అమరావతి సభకు వేశారు. ఇందులో బొబ్బిలి నియోజకవర్గంలో 5, చీపురుపల్లి 5, గజపతినగరం 5, నెల్లిమర్ల 5, రాజాం 5, ఎస్.కోట 5, విజయనగరం నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున బస్సుల ద్వారా జనాలను తరలించారు. ఒక్కో బస్సుకు 40 నుంచి 50 మంది వరకు వెళ్లారు. ఇవి కాక, ప్రైవేట్ సర్వీసుల ద్వారానూ పెద్ద ఎత్తున జనం వెళ్లారు.
● పార్వతీపురం మన్యం జిల్లాలో 15 మండలాల నుంచి ఆర్టీసీ సేవల్లో కోత పెట్టి అమరావతికి తరలించారు. ప్రధానంగా పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల నుంచి దాదాపు 60 బస్సుల్లో డ్వాక్రా సంఘ సభ్యులు, ఉపాధి వేతనదారులను అమరావతికి తీసుకెళ్లారు. ఈ తంతు నేరుగా జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలోనే సాగడం గమనార్హం. మండలానికి ఒకట్రెండు బస్సులు వెళ్లాయి. ప్రధానంగా ఉపాధిహామీ వేతనదారులు, డ్వాక్రా సభ్యులను తరలించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఈ బాధ్యతను దిగువస్థాయి సిబ్బందికి అప్పగించారు. వారిపై నాయకులు, శాఖాపరమైన అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చారు.
● పాలకొండ డిపో నుంచి 14 బస్సులు గుంటూరుకు కేటాయించగా.. మరో ఐదు సర్వీసులను నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి అమరావతికి పంపించారు. గురువారం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విశాఖ–2, శ్రీకాకుళం–1, కొత్తూరు–5 సర్వీసులు రద్దు చేసి ప్రత్యామ్నాయ సేవలు అందించే ఏర్పాటు చేశారు.
● పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి అయిదు బస్సులు చొప్పున వెళ్లాయి. ఇలా నాలుగు నియోజకవర్గాల్లో పార్వతీపురం డిపో 14, పాలకొండ 14, సాలూరు డిపో నుంచి 12 బస్సులు చొప్పున వెళ్లాయి. ఇవి కాక.. కొన్ని ప్రాంతాల నుంచి అదనంగా ఉన్న ఆర్టీసీ బస్సులను, ప్రైవేట్ సర్వీసులను కూడా వినియోగించారు. పార్వతీపురం కలెక్టరేట్ నుంచి చుట్టుపక్కల మండలాల ప్రజల కోసం 20 బస్సులు గురువారం బయల్దేరి వెళ్లాయి. ఇలా 15 మండలాలకూ లక్ష్యాలను నిర్దేశించారు. మండలానికి కనీసం వంద మంది బయల్దేరినట్లు తెలుస్తోంది.
అమరావతి పునఃనిర్మాణమంటూ మళ్లీ.. భజంత్రీలు
మోదీ రాక నేపథ్యంలో భారీ
జనసమీకరణకు ఏర్పాట్లు
మండల స్థాయి నుంచి పెద్ద ఎత్తున
అమరావతికి తరలింపు
మహిళా సంఘాలు, ఉపాధి
వేతనదారులే అధికం
హడావిడిలో కూటమి నాయకులు
అధికారులకు బాధ్యతలు.. టార్గెట్‌లు
రూ.లక్షల ప్రజాధనం వృథా
విజయనగరం, పాలకొండ, పార్వతీపురం తదితర ప్రాంతాల్లోని రద్దీమార్గాలోని బస్సులను అమరావతికి జనాల తరలింపునకు వినియోగించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం మధ్యాహ్నం నుంచి ఆయా రూట్లలో వెళ్లేవారు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మరోవైపు అమరావతి ప్రయాణమంటేనే విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి మూడు రోజులు కేటాయించాల్సి వస్తుందని.. అన్ని రోజులు కుటుంబాలను, పిల్లలను వదిలి వెళ్లడం కష్టంగా ఉంటుందని పలువురు మహిళలు వాపోయారు. దీనికితోడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ఈ సమయంలో బస్సుల్లో అంత దూరం ఎలా వెళ్లగలమంటూ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. వెళ్లకపోతే పనులు కల్పించబోమని హెచ్చరించడంపై పలువురు ఉపాధిహామీ వేతనదారులు నిలదీశారు. అయితే, పై నుంచి వచ్చిన ఆదేశాలంటూ అధికారులు సర్దిచెప్పేప్రయత్నం చేశారు.
అతిథులారా.. రారండోయ్!


