అటు వైపు ఎవరూ వెళ్లొద్దు..!
చీపురుపల్లి: ‘అటు వైపు ఎవరూ వెళ్లొదు.. అదంతా సార్‌కి ఇష్టం ఉండదు.. డీసీసీబీ చైర్మన్ అయితే విజయనగరం ఆఫీస్‌లో ఉండాలి.. ఇక్కడేం పని.. వెళ్లొద్దని అన్ని గ్రామాల కేడర్‌కు తక్షణమే సమాచారం అందించండి.. అదే సమయంలో సార్ రాజాంలో అందుబాటులో ఉంటారని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు కూడా పంపించాం చూసుకోండి’
తాజాగా డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున స్వాగత ర్యాలీకు హాజరుకాకుండా నియోజకవర్గంలోని నాలుగు మండలాల ముఖ్య నాయకులకు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి అందిన మౌఖిక ఆదేశాలు పార్టీ క్యాడర్‌లో చర్చనీయాంశంగా మారాయి. కొందరు నాయకులు సెల్‌లకు వచ్చిన మెసేజ్‌లను చూపిస్తూ.. చీపురుపల్లిలో బుధవారం సాయంత్రం జరిగిన డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున స్వాగత ర్యాలీకు ముఖం చాటేశారు. నాలుగు మండలాల్లో ఉండే మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీలు, ప్రధాన నాయకుల నుంచి పంచాయతీల్లో సర్పంచ్, మాజీ సర్పంచ్‌లు వరకు ఎవ్వరూ హాజరుకాకపోవడంపై చర్చ సాగింది. కేవలం ద్వితీయ శ్రేణి క్యాడర్, అభిమానులతో కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. నాగార్జున వద్దకు క్యాడర్‌ను వెళ్లొద్దని చెప్పడం అధిష్టానం నిర్ణయాన్ని అగౌరవ పరచడం కాదా అంటూ కొందరు కార్యకర్తలు బహిరంగంగా విమర్శించారు.
చర్చకు దారితీసిన మెసేజ్..
డీసీసీబీ చైర్మన్‌గా నియమితులైన కిమిడి నాగార్జున బుధవారం సాయంత్రం 4 గంటలకు చీపురుపల్లిలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని ఆయన కార్యాలయం నుంచి మంగళవారం సాయంత్రమే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పంపించారు. పార్టీ క్యాడర్‌కు ఫోన్‌లో సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో భారీ స్థాయిలో స్వాగత ర్యాలీ చేసేందుకు క్యాడర్ సిద్ధమైంది. రాత్రి 7.46 గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యాలయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో సాయంత్రం 4 గంటల నుంచి ఎమ్మెల్యే కళా వెంకటరావు రాజాం నివాసంలో అందుబాటులో ఉంటారని మెసేజ్ వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రం అందుబాటులో ఉండరని, 4 గంటల తరువాత మాత్రమే అందుబాటులో ఉంటారని గమనిక మెసేజ్‌గా పెట్టడం చర్చకు దారి తీసింది. నాగార్జున స్వాగత ర్యాలీకి ఎవరూ వెల్లొద్దని ఫోన్‌లో ఆదేశాలు ఇచ్చినట్లు సొంత పార్టీ క్యాడర్‌లోనే చర్చ జరుగుతోంది. కిమిడి నాగార్జునకు పదవి రావడంతో బలం పెరుగుతుందన్న భయం కళావెంకటరావును వెంటాడుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే స్వాగత ఫ్లెక్సీలు వేసేవారిని కూడా నిలువరించినట్టు సమాచారం. ‘కిమిడి’ కుటుంబంలో అంతర్యుద్ధం కొనసాగుతుందనేందుకు ఈ సంఘటన మరోసారి అద్దం పడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ క్యాడర్‌కు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆదేశాలు
డీసీసీబీ చైర్మన్ నాగార్జున ర్యాలీకు ముఖం చాటేసిన ప్రధాన క్యాడర్
‘కిమిడి’ కుటుంబంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం


