వెబ్‌సైట్‌లో ప్రొవిజనల్ మెరిట్ జాబితా
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో ఐదు కేటగిరీల్లో ఖాళీ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో పొందుపరచినట్టు ప్రభు త్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెట్‌వర్క్ ఆడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ప్రొగ్రామర్, ఈఎంటీ, స్టోర్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంఽధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాలో అభ్యంతరాలుంటే ఈ నెల 29, మే 3, 5, 6 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలన్నారు.
ప్రతిభావంతులకు సత్కారం
విజయనగరం అర్బన్: పదోతరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తన చాంబర్‌లో సోమవారం సత్కరించారు. సంగారెడ్డి వివేక్ (జెడ్పీ హైస్కూల్ గర్భాం), కొయ్య హరీష్ (ఏపీమోడల్ స్కూల్, భోగాపురం), లావేటి మెహర్ రేష్మ (బీసీ సంక్షేమ గురుకులం, నెల్లిమర్ల), చోడవరపు శివ (బీసీ సంక్షేమ గురుకులం కారాడ), పెదిరెడ్ల భాగ్యశ్రీ (జెడ్పీ హైస్కూల్, కొట్యాడ), శంబంగి కలవల లక్ష్మి (జెడ్పీహెచ్‌ఎస్, పక్కి), తాడేల రేవంత్ (జెడ్పీ హెచ్‌ఎస్, భైరిపురం), సెనేట మోహన్ (బీసీ సంక్షేమ గురుకులం, కారాడ), పైల యశోద (జెడ్పీ హెచ్‌ఎస్, జిన్నాం) విద్యార్థులను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రచించిన ఒక విజేత ఆత్మకథ, డాక్టర్ బీవీపట్టాభిరాం రచించిన ‘కష్టపడి చదవొద్దు–ఇష్టపడి చదవండి’పుస్తకాలిచ్చి అభినందించారు. విద్యార్థుల తల్లి దండ్రులను దుశ్శాలువలతో సత్కరించారు. శతశాతం ఉత్తీర్ణత సాధించిన జామి, వంగర, గజపతినగరం, ఎస్.కోట కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ యు. మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్షణ ఏపీసీ డాక్టర్ ఏ.రామారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ టీ.సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.


