
రాములోరికి ప్రత్యేక పూజలు
● అధిక సంఖ్యలో దర్శించుకున్న భక్తులు
నెల్లిమర్ల రూరల్: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో వైశాఖమాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించిన తరువాత యాగశాలలో ప్రత్యేక హోమాలు జరిపించారు. అనంతరం ప్రధాన ఆలయంలోని వెండి మంటపం వద్ద సీతారాముల నిత్య కల్యాణ మహోత్సం కనుల పండువగా జరిపించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వైశాఖమాసంలో ఏకాదశి కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రామక్షేత్రానికి విచ్చేసి స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. పలువురు పర్యాటకులు అలనాటి చారిత్రక గుర్తులను తిలకించేందుకు బోడికొండపైకి వెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
కోటదుర్గమ్మను దర్శించుకున్న ఏఎస్పీ
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మను పార్వతీపురం మన్యం జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ దిలీప్‌కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి ప్రీతిపాత్రమైనరోజు, ఏకాదశి సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ కృష్ణారావు, సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రశాంత్‌కుమార్‌లు ఉన్నారు. అనంతరం ఆయన ఎన్నికల సయంలో చేపట్టిన బందోబస్తుపై సమీక్ష నిర్వహించి కౌంటింగ్ వరకు ఎక్కడా అల్లర్లు లేకండా 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.
జిందాల్ కార్మికుల వంటావార్పు
● కర్మాగారం వద్ద ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామం సమీపంలో గల జిందాల్ స్టెయిన్‌లెస్‌స్టీల్ కర్మాగారాన్ని ముడిసరుకు కొరత కారణంగా తాత్కాలికంగా ఈనెల 17వ తేదీన మూసివేయడంతో నాటినుంచి కర్మాగారంలో కాంట్రాక్ట్, శాశ్వత పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 280 మంది కార్మికులు కర్మాగారం ప్రధాన గేటు వద్ద టెంట్ వేసి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమానికి వివిధ కార్మిక సంఘాలకు చెందిన నాయకులు, కర్మాగారం చుట్టుపక్కల గ్రామాలైన అప్పన్నపాలెం, ఉత్తరాపల్లి, నిమ్మలపాలెం గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో కార్మికులు ఆందోళన ఉద్ధృతం చేశారు. దీక్షా శిబిరం వద్ద ఆదివారం వంటావార్పు ఆందోళన చేపట్టి అక్కడే భోజనాలు చేసి టెంట్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ సుమారు 38 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని ఇప్పడు అర్ధాంతరంగా కర్మాగారం మూసివేస్తే మా బతుకులు రోడ్డుపాలవుతాయని ఆవేదన వెలిబుచ్చారు. కర్మాగారం వెంటనే తెరవాలని విజ్ఞప్తి చేశారు. కర్మాగారం మూసివేసిన కాలానికి పూర్తి వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు కర్మాగారం యాజమాన్యంతో చర్చలు జరిపి కొన్ని డింమాండ్‌లను వారి ముందుంచారు. ఆ డిమాండ్‌లపై సోమవారం వివరణ ఇస్తామని యాజమాన్య ప్రతినిధులు ప్రకటించారు.

రాములోరికి ప్రత్యేక పూజలు

రాములోరికి ప్రత్యేక పూజలు

రాములోరికి ప్రత్యేక పూజలు