
పిడుగుపాటుతో ఒకరి మృతి
శృంగవరపుకోట: పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని వెంకటరమణపేటలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ భారం మోస్తున్న యజమాని చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వెంకటరమణపేటకు చెందిన బొబ్బిల అప్పలస్వామి (29) నిత్యం గొర్రెలను మేతకు తోలుతూ ఉంటాడు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో జీవాలను తోలుకుని కంచిపాటి రాము క్వారీ సమీపంలోని మెట్టకు వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో జీవాలు ఇంటికి చేరినా.. అప్పలస్వామి రాకపోవటంతో కుటుంభీకులు, ఇరుగుపొరుగు వారు గ్రామ శివారుల్లో వెతికారు. అయితే మెట్టపై అప్పలస్వామి విగతజీవిగా కనిపించడంతో, పిడుగుపాటుకు మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుడికి భార్య, మూడు నెలల వయసున్న కుమారుడు, తల్లి, ఇద్దరు సోదరులున్నారు. ఇంటి బాధ్యతలు మోస్తున్న వ్యక్తి చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.