వైఎస్సార్‌ పింఛన్‌ కానుక రూ.3,000

- - Sakshi

విజయనగరం అర్బన్‌: అవ్వాతాతలకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తీపికబురు అందించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రస్తుతం ఇస్తున్న రూ.2,750 పింఛన్‌ డబ్బులను మరో రూ.250 పెంచి రూ.3,000 అందజేస్తామని సోమవారం ప్రకటించారు. దీంతో రెండు వారాల ముందుగానే అవ్వాతాతలకు దసరా పండగ వచ్చినట్టయింది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి విజయవాడ వేదికగా చేసిన ప్రకటనతో పింఛన్‌దారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.2వేలు ఉన్న పింఛన్‌ను రూ.250 పెంచుతూ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసంతంకం చేశారు. అప్పటి నుంచి ఏటా జనవరిలో రూ.250 చొప్పున పెంచుతూ ప్రస్తుతం రూ.2,750 అందజేస్తున్నారు.

జిల్లాలో లబ్ధిదారులు ఇలా....
విజయనగరం జిల్లాలో కొత్తగా 11,400 మందికి పింఛన్లు మంజూరు చేశారు. వీరితో కలిపి వివిధ కేటగిరీల్లో మొత్తం 2,83,764 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం రూ.2,750 చొప్పున వీరందరికీ ప్రతినెలా రూ.78.31 కోట్లను ప్రభు త్వం అందిస్తోంది. జనవరి నుంచి రూ.250 పెంచిన తరువాత రూ.3 వేల చొప్పున రూ. 85.42 కోట్లు ప్రతినెలా పింఛన్‌దారులకు అందనుంది. జనవరి నుంచి అదనంగా మరో రూ.9.11 కోట్లు జిల్లాలోని పింఛన్‌దారులకు ప్రభుత్వం కేటాయించనుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పింఛన్‌దారులకు రూ.వెయ్యి ఇచ్చే వారు. 2019 సార్వ త్రిక ఎన్నికలకు నాలుగునెలల ముందు వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను కాపీకొట్టిన టీడీపీ ప్రభుత్వం పింఛన్‌ను రూ.2 వేలకు పెంచింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పింఛన్‌ను దశలవారీగా పెంచుతూ రూ.2,750 చేసింది. మరోవైపు దివ్యాంగులకు రూ.3వేలు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రూ.5 వేలు చొప్పున పింఛన్‌ డబ్బులు అందజేస్తోంది.

కొత్త సంవత్సరం నుంచి రూ.3వేలు పింఛన్‌
వైఎస్సార్‌ పింఛన్‌ కానుక వచ్చే ఏడాది జనవరి నెల నుంచి రూ.250 పెంచుతూ మొత్తం రూ.3 వేల ఇవ్వనున్నాం. ప్రస్తుతం జిల్లాలో ప్రతినెలా రూ.78.31 కోట్లను పింఛన్‌దారులకు అందజేస్తున్నాం. పెరిగిన మొత్తంతో కలిపి ఇప్పుడున్న పింఛన్‌దారులకు జనవరిలో రూ.85.42 కోట్లను అందజేస్తాం.
– ఎ.కళ్యాణచక్రవర్తి, పీడీ, డీఆర్‌డీఏ

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top