అప్పట్లో ఠంచన్‌గా పింఛన్
‘తమ్ముళ్లూ.. గుర్తుపెట్టుకోండి.. మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెనుకబడిన వర్గాల వారికి 50 ఏళ్ల వయస్సు నిండితే పింఛన్ అందజేస్తాం. ఈ విషయాన్ని ఊరూరా వెళ్లి చెప్పండి..’ అంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచినా ఒక్కరంటే ఒక్కరికి కొత్త పింఛన్ మంజూరు చేయలేదు. 50 ఏళ్ల ప్రతిపాదన పక్కన పెడితే 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు సైతం పింఛన్ మంజూరు కాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. పింఛన్ రాదు.. మా టెన్షన్ పోదు అంటూ తెలిసినవారి దగ్గర, సచివాలయ సిబ్బంది వద్ద వాపోతున్నారు. ఇదెక్కరి రాక్షస పాలన అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు బి.పైడమ్మ. ఈమెది దత్తిరాజేరు మండలం ఇంగిలాపల్లి గ్రామం. ఈమె భర్త నాలుగు నెలల కిందట మరణించారు. వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు సచివాలయం అధికారులను అడిగితే వెబ్‌సైట్ ఓపెన్ కాలేదని చెప్పారు. దీంతో చేసేది లేక మిన్నకుండిపోయారు.
విజయనగరం ఫోర్ట్:
సార్వత్రిక ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన వెనుకబడిన వర్గాలవారికి పింఛన్లు మంజూరు చేస్తామని చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు గొప్పగా ప్రచారం చేశారు. ఓట్లు దండుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక 19 నెలలుగా వారిని ఉసూరుమనిపిస్తున్నారు. కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ఆవేదనకు గురిచేస్తున్నారు. 50 ఏళ్లు మాట దేవుడెరుగు 60 ఏళ్లు నిండిన వృద్ధులు, భర్తలను కోల్పోయిన వితంతువులు, సదరం ధ్రువపత్రాలు పొందిన దివ్యాంగులకు కూడా పింఛన్లు మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు. కొత్త పింఛన్ల కోసం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు 25 వేల మంది వరకు ఎదురు చూస్తున్నట్టు సమాచారం. వృద్ధులతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఒంటిరి మహిళలు, డప్పు కళాకారులు, మత్య్సకారుల్లోని అర్హులు సైతం పింఛన్లు కోసం ఎదురుచూస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. అర్హుల నుంచి ఆరు నెలల పాటు దరఖాస్తులను వలంటీర్లతో ఇంటివద్దనే సేకరించడం... అర్హులను గుర్తించి పింఛన్లు మంజూరు చేయడం నిరంతరాయంగా సాగేది. 60 ఏళ్లు నిండితే చాలు పింఛన్ వస్తుందన్న ధీమా ఉండేది. మత్య్సకారులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పుకళాకారులకు 50 ఏళ్లు నిండితే చాలు పింఛను మంజూరు చేసేవారు. పర్మినెంట్ సదరం సర్టిఫికెట్ ఉన్నవారికి, 19 ఏళ్లు నిండిన ట్రాన్స్‌జెండర్స్‌కు, వయసుతో సంబంధం లేకుండా డయాలసిస్ రోగులకు డీఎంహెచ్‌ఓ పింఛన్లు అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని లబ్ధిదారులు వాపోతున్నారు.
వెబ్‌సైట్
ఓపెన్ కాలేదు
పింఛన్ల కోసం వేలాది మంది అర్హుల ఎదురుచూపు
రెండేళ్లుగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతవులకు మంజూరుకాని పింఛన్లు
నెరవేరని 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛన్లు ఇస్తామన్న చంద్రబాబు హామీ
60 ఏళ్లు నిండిన వారికీ అందని
పింఛన్
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పింఛన్లు మంజూరు
కొత్తగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ తదితర పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెబ్‌సైట్ ఇంకా ఓపెన్ కాలేదు. స్పౌజ్ కోటాలో వద్ధాప్య పింఛన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు మాత్రమే పింఛన్ అందజేస్తున్నాం. – శ్రీనివాసపాణి, డీఆర్‌డీఏ పీడీ
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఎస్.కాంతమ్మ. ఈమెది గంట్యాడ మండలం పెదవేమలి గ్రామం. ఈమె భర్త చనిపోయి ఏడాది అవుతోంది. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామంలోని సచివాలయం అధికారులను పలుమార్లు సంప్రదిస్తూనే ఉంది. ఎప్పుడు వెళ్లినా పింఛన్ కోసం దరఖాస్తు చేయడానికి వెబ్‌సైట్ ఓపెన్ కాలేదని చెబుతున్నారంటూ వాపోతోంది.
ఇదే మండలం పెదవేమలి గ్రామానికి చెందిన ఆర్.నాగేశ్వరావుకు ప్రస్తుతం 62 ఏళ్లు. వృద్ధాప్య పింఛన్ మంజూరైతే జీవన కష్టాలు తొలగుతాయని ఆశపడ్డారు. దరఖాస్తు చేసేందుకు పలుమార్లు సచివాలయం అధికారులను సంద్రించినా ఫలితం లేకపోయింది. కనీసం దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ నిట్టూర్చుతున్నారు.
అప్పట్లో ఠంచన్‌గా పింఛన్
అప్పట్లో ఠంచన్‌గా పింఛన్


