సాంకేతిక ఆవిష్కరణలతో సమాజాభివృద్ధి
● విద్యార్థుల భవిష్యత్తుకు సాంకేతిక ఉత్సవం దోహదం
● శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాల
డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ
చీపురుపల్లిరూరల్(గరివిడి):
విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సాంకేతిక ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ కేవీజీడీ బాలాజీ అన్నారు. గరివిడి అవంతీ సెయింట్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రగ్యాన్–2026 పేరుతో జాతీయస్థాయి సాంకేతిక ఉత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాల జ్ఞానంతోనే కాకుండా ఆవిష్కరణాత్మక ఆలోచనలు, సృజనాత్మకత, పరిశోధన దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. క్వాంటమ్ కంప్యూటర్ భవిష్యత్తులో సాంకేతిక రంగాన్ని మార్చగలదని తెలియజేశారు. విశాఖపట్నం డీఆర్‌డీఓ ఎన్‌ఎస్‌టీఎల్ సైంటిస్టు బి.సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యార్థులు సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు చేసి సమాజాభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. విశాఖపట్నం ఇన్ఫోసిస్ గ్రూపు మేనేజర్ కె.కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు సాగాలన్నారు. బ్రహ్మకుమారీస్ కేంద్ర ఇన్‌చార్జి బి.కె.హేమలత మాట్లాడుతూ సాంకేతికత జీవితాన్ని సులభతరం చేస్తుందన్నారు. అవంతీ విద్యాసంస్థల జనరల్ సెక్రటరీ ఎం.లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.జె.బాలబాస్కరరావు, వైస్ ప్రిన్సిపాల్ బి.వెంకటరమణ, ఏఓ జి.అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.


