సీతకు అరుదైన అవకాశం

- - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 15న జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను వీక్షించేందుకు చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన ఉపాధిహామీ వేతనదారు యందవ సీతకు ఆహ్వా నం అందింది. దేశవ్యాప్తంగా 1800 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తోంది. వీరిలో సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, రైతులు, నర్సులు, మత్య్సకారులు, కూలీలు తదితర వర్గాలకు చెందిన వారు ఉంటారు. ఉపాధిహామీ వేతనదారుల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఇద్దరికి అవకాశం లభించగా అందులో సీత ఒకరు. ఈ నెల 13వ తేదీన గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు.

సంతోషంగా ఉంది
ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలు టీవీలో చూస్తేనే ఎంతో గొప్పగా ఉంటాయి. అలాంటి వేడుకులకు దగ్గరుండి వీక్షించేందుకు అవకాశం లభించడం ఆనందంగా ఉంది. మూడు రోజుల కిందట ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ తరువాత జిల్లా అధికారులు ఫోన్‌ చేశారు. ఈనెల 13న గన్నవరం నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణానికి ఏర్పాట్లు చేశారు. జీవితంలో మరిచిపోలేని సంఘటన ఇది. డిగ్రీవరకు చదువుకున్నాను. డైట్‌ శిక్షణ కూడా పొందాను. గత ఏడాది డిసెంబర్‌ వరకు ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేశాను. ఆరోగ్య సమస్య తలెత్తడంతో మానేసి ఉపాధి హామీ పనులకు వెళ్తున్నాను.
– యందవ సీత, రామలింగాపురం గ్రామం, చీపురుపల్లి మండలం

Read latest Vizianagaram News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top