● ఏడాదిలో మూడుసార్లు వివిధ ప్రదేశాల్లో పూజలు
● భయాందోళనలో పల్లెప్రజలు
● చంద్రగ్రహణం రోజున పూజల కలవరం
బొండపల్లి:
బొండపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గెద్దపేట గ్రామానికి ఆనుకొని ఉన్న సిరి చెరువులో బుధవారం వేకువజామున క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపాయి. ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చంద్రగ్రహణం అనంతరం చెరువులో మూడు చోట్ల నిమ్మకాయలతో పాటు మనిషిబొమ్మ, ఇతర సామగ్రి, నల్లని కోడిపెట్టలను అక్కడే చంపివేసి పూజలు నిర్వహించడం, ఏడాదిలో ఇదే రీతిన మూడు సార్లు ఈ ప్రాంతంలో పూజలు చేయడంపై భయపడుతున్నారు. అటువైపుగా వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించడంలేదు. పూజలు చేసిన వారిపై నిఘాపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఎస్‌ఐ యు.మహేష్ మాట్లాడుతూ పూజల సమాచారం అందిందని, నిఘా వేసి సబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు.
కింతలివానిపేటలో...
బొబ్బిలిరూరల్: మండలంలోని దిబ్బగుడ్డివలస పంచాయతీ పరిధిలోని కింతలివానిపేటలో మంగళవారం రాత్రి క్షుద్రపూజలు చేశారన్న అంశం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ వీఽధి నాలుగురోడ్ల కూడలిలో పెద్దగా ముగ్గులువేసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో పూజలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రగ్రహణం అనంతరం అర్ధరాత్రి పూట ఈ పూజలు నిర్వహించారని, ఇది దేనిసంకేతమో తెలియడం లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామ పెద్దలు పోలీసులకు సమాచారమిచ్చారు.


