శతశాతం ఫలితాల సాధనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

శతశాతం ఫలితాల సాధనే లక్ష్యం

Mar 5 2026 7:44 AM | Updated on Mar 5 2026 7:44 AM

డీఈఓ మాణిక్యంనాయుడు

రామభద్రపురం: పదో తరగతి వార్షిక పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించాలని డీఈఓ యు.మాణిక్యంనాయుడు సిబ్బందికి సూచించారు. బొబ్బిలి డివిజన్‌ పరిధిలోని డీఓలు, సీఎస్‌లకు పరీక్షల నిర్వహణపై బుధవారం ఒక రోజు శిక్షణ ఇచ్చారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవడంలో 5 నిమిషాలు ఆలస్యం అయినా అనుమతించాలని సూచించారు. జిల్లాలో 440 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 22,961 మంది విద్యార్థులు 119 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారన్నారు. మొత్తం 1350 మంది ఇన్విజిలేటర్లు, ఒక్కో పరీక్ష కేంద్రానికి ఒక్కో డీఓ, సీఎస్‌లను నియమిస్తున్నట్టు వెల్లడించారు. ఇన్విజిలేటర్ల నియామకంలో విమర్శలకు తావులేకుండా రాష్ట్ర విద్యాశాఖ నుంచే ర్యాండమ్‌గా నియమిస్తూ జాబితా తయారైందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రామ్మోహనరావు, డీఈసీ మెంబర్‌ సన్యాసిరాజు, ఎంఈఓ తిరుమలప్రసాద్‌, ఏఎస్‌ఓ బి.లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి

విజయనగరం ఫోర్ట్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి అధికారులను బుధవారం ఆదేశించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోను, ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. విజయనగరం పోలీస్‌బ్యారెక్స్‌లో నిర్వహించే ఉత్సవాలకు సుమారు 3 వేల మంది వరకు మహిళలు హాజరవుతారని, వారికి తాగునీరు, స్నాక్స్‌, శానిటేషన్‌ తదితర ఏర్పాట్లు చూడాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచించారు. మహిళా పారిశ్రామిక వేత్తలను సన్మానించేందుకు, వారి విజయగాథలను వివరించేందుకు ఏర్పాట్లు చేయాలని డీఆర్‌డీఏ పీడీకి తెలిపారు. సమావేశంలో జేసీ సుతుమాధవన్‌, అదనపు ఎస్పీ సౌమ్యలత, ఆర్డీఓ వెంకటేశ్వరావు, సీపీఓ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

తలసేమియా వ్యాధితో విద్యార్థి మృతి

జామి: మండలంలోని శాసనపల్లి గ్రామానికి చెందిన గంధవరపు భరత్‌(9) తలసేమియా వ్యాధితో బుధవారం మృతి చెందాడు. భరత్‌ స్థానిక ప్రాధమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడు. అప్పారావు, లక్ష్మీ దంపతుల కుమారుడైన భరత్‌ చిన్నప్పటి నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. విశాఖ, చైన్నె, బెంగళూరు తదితర చోట్ల వైద్యం చేయించారు. బెంగళూరులో శస్త్రచికిత్సకు రూ.15లక్షల వరకు అవుతుందని వైద్యులు చెప్పడంతో పేదలు కావడంతో డబ్బుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంతలోనే విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. భరత్‌ మృతితో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

పారదర్శకంగా పది పరీక్షల నిర్వహణ

ఆర్‌జేడీ విజయభాస్కర్‌

విజయనగరం అర్బన్‌: పది పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా నిర్వహణ జరగాలని విద్యా శాఖ ఆర్‌జేడీ బి.విజయభాస్కర్‌ అన్నారు. స్థానిక ఫోర్ట్‌ సిటీ స్కూల్‌లో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్‌ సూపరింటెండెంట్లు, విభాగాధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ సక్రమంగా పారదర్శకంగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పరీక్షల సమయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తూ, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోసుకోకుండా అప్రత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement