ప్రాణాలుతీస్తున్న మందుల దందా! | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలుతీస్తున్న మందుల దందా!

Nov 26 2026 12:18 AM | Updated on Nov 26 2026 12:18 AM

● ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే ప్రమాదకర ఔషధవిక్రయాలు ● సొంత వైద్యంతో ప్రాణాలకే ముప్పు అంటున్న నిపుణులు ● జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల వరకూ మెడికల్‌ షాపులు ● నిబంధనలు మీరి నిషేధిత, ప్రమాదకర మందుల విక్రయాలు

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సాక్షి, విశాఖపట్నం: గడువు ముగిసిన మందుల్లో రసాయన ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. వీటిని వాడితే వ్యాధి నయం కాకపోగా, కొన్నిసార్లు విషపూరితంగా మారి తీవ్ర దుష్ప్రభావాలకు దారితీస్తాయి. కొందరు వ్యాపారులు కాలం చెల్లిన మందులపై పాత తేదీల స్థానంలో కొత్త తేదీలను ముద్రించి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం(షుగర్‌), గ్యాస్ట్రిక్‌, రక్తపోటు(బీపీ), గుండె, నరాలు, ఎముకలకు సంబంధించిన మందుల్లోనే ఇలాంటి అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఈ మందులు వేసుకునే రోగుల్లో తీవ్ర దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫార్మసిస్టులు లేకుండానే నిర్వహణ

జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల వరకు మెడికల్‌ షాపులు ఉన్నాయి. వీటిలో కొన్ని దుకాణాల్లో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే యాంటీబయోటిక్స్‌, నిద్ర మాత్రలు, స్టెరాయిడ్లు, పెయిన్‌ కిల్లర్లు వంటి ప్రమాదకర మందులను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జలుబు మొదలుకుని దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఆస్పత్రులకు వెళ్లకుండా స్వయం చికిత్స కోసం చాలామంది నేరుగా మెడికల్‌ షాపులనే ఆశ్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన ఫార్మసిస్ట్‌ పర్యవేక్షణలో మందులు విక్రయించాల్సి ఉండగా, పలుచోట్ల షాపుల యజమానులు లేదా సిబ్బందే డాక్టర్ల అవతారమెత్తి సలహాలిస్తూ మందులు అంటగడుతున్నారు.

నిషేధిత, ప్రమాదకర ఔషధాల విక్రయం

నిబంధనలకు విరుద్ధంగా పలు మెడికల్‌ షాపుల్లో డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే మిసోప్రోస్టల్‌ (అబార్షన్‌ కిట్‌), డయాబెటిక్‌, బీపీ మందులు, డైక్లోఫెనాక్‌ మాత్రలు, నిద్రమాత్రలు (ఆల్ఫ్రాజోలం, డైజెపామ్‌) విక్రయిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా అబార్షన్‌ కిట్లు వాడితే తీవ్ర రక్తస్రావమై ప్రాణాలకే ప్రమాదం సంభవిస్తుంది. పెయిన్‌ కిల్లర్లను అతిగా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. బీపీ, షుగర్‌ మందులను ఇష్టమొచ్చినట్లు వాడితే మెదడు, గుండైపె తీవ్ర ప్రభావం చూపుతాయి.

మందులు కొనుగోలు చేసేటప్పుడు తయారీ తేదీ(ఎంఎఫ్‌జీ), గడువు తేదీ(ఎక్స్‌పైరీ), బ్యాచ్‌ నంబర్‌ తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

లైసెన్స్‌ కలిగిన, గుర్తింపు పొందిన మెడికల్‌ షాపుల్లోనే కొనుగోలు చేసి, కచ్చితంగా బిల్లు తీసుకోవాలి.

వైద్యులు సూచించిన మందులు మాత్రమే వాడాలి.

ఒకరికి రాసిన మందులు వేరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూవినియోగించరాదు.

మాత్రలు, సిరప్‌ల రంగు, వాసన, ఆకృతిలో మార్పు కనిపిస్తే వెంటనే పారవేయాలి.

మందుల నిల్వకు సంబంధించి ప్యాకెట్‌పై సూచించిన ఉష్ణోగ్రత నిబంధనలు పాటించాలి.

గడువు తీరిన మందులు విక్రయిస్తే చర్యలు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ గడువు తీరిన మందులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. మందులు కొనేటప్పుడు గడువు తేదీని పరిశీలించి, తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ఎక్కడైనా కాలం చెల్లిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

– రజిత, డ్రగ్‌ కంట్రోలర్‌ డీడీ, విశాఖ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement