మహారాణిపేట: విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఆర్కే బీచ్ రోడ్డులోని గోకుల్ పార్కులో ‘రాధాకృష్ణ పాలు, పెరుగు యదుమేళా’ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నుంచి యాదవులు నిర్వహిస్తున్న ఈ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి రాధాకృష్ణ మందిరంలో పూజలు చేశారు. గోకుల్ పార్కులోని కృష్ణుడి విగ్రహానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా పాలు, పెరుగు సమర్పించారు. జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కరమాని వెంకటరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మాజీ మేయర్ గొలగాని హరివెంకటరావు, మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి, కార్పొరేటర్లు ఉరుకూటి నారాయణరావు, కోన రాధిక, బొట్టా నీలిమ, పల్లా శ్రీనివాసరావు, మన్యాల శ్రీనివాస్, యాదు వంశీ సంఘం నేత గుంటుబోయిన రవికుమార్, కోడిబోయిన రామకృష్ణ, పల్లా మహేష్, ఉమ్మడి నరసింహరావు, అల్సి అప్పల నారాయణ తదితర నాయకులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.


