తాటిచెట్లపాలెం: రైల్వే అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్(ఎన్‌ఎఫ్‌ఐఆర్) జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య తెలిపారు. జోన్ విభజనానంతరం ఢిల్లీ నుంచి తొలిసారిగా విశాఖపట్నం వచ్చిన ఆయనకు సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దొండపర్తిలోని సంఘ్ కార్యాలయంలో బుధవారం మీడియాతో మర్రి రాఘవయ్య మాట్లాడారు. నూతన రైల్వే జోన్ ఏర్పడిన నాటి నుంచి విశాఖపట్నం డివిజన్ పరిధిలో ఉద్యోగుల సీనియారిటీ, బదిలీలు, ఇతర ప్రయోజనాలపై పలు సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. వీటిపై చర్చించేందుకు తాము గురువారం సౌత్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌తో భేటీ కానున్నామని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన రైల్వేలో ప్రయాణికులు, రైళ్ల భద్రత కోసం నిరంతరం పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, కార్మికుల సేవలకు ప్రభుత్వం సరైన విలువ ఇవ్వకుండా విస్మరిస్తోందన్నారు. రైల్వే కార్మికులకు కనీస వేతనంగా రూ.69 వేలు నిర్ణయించాలని 8వ పే కమీషన్‌కు విన్నవించామని తెలిపారు. యూపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, అలవెన్స్‌లు పెంచాలని డిమాండ్ చేయనున్నట్లు చెప్పారు. దేశంలో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టులను భర్తీ చేయాలని రైల్వే బోర్డును కోరారు. సమావేశంలో సౌత్ కోస్ట్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జోనల్ ప్రెసిడెంట్ టి.వి.మౌళీశ్వరరావు(మౌళీ), వైస్ ప్రెసిడెంట్ ఆకుల రాజేంద్రప్రసాద్, జాయింట్ జనరల్ సెక్రటరీ యడ్ల నాగేంద్రబాబు, ఏజీఎస్‌లు కె.నాగేశ్వరరావు, ఎ.రాధికా సుప్రియ, ఎ.వెంకటరావు, ఎం.మహేశ్వరరావు, జె.సంపత్‌కుమార్, ట్రెజరర్ వై.సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


