డాబాగార్డెన్స్: బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుందని డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు స్పష్టం చేశారు. బాల్య వివాహ రహిత విశాఖపట్నం సాధనే లక్ష్యంగా బుధవారం జడ్జి కోర్టు ప్రాంగణంలో యాక్సెస్ టు జస్టిస్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సీడీపీవో నీలిమ మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణకు గ్రామస్థాయి బాలల రక్షణ కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా బాలల రక్షణ అధికారి కె.హరికృష్ణ మాట్లాడుతూ బాల్య వివాహాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సెట్విస్ సీఈవో ఎం.రమ్య, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ హరివెంకటరమణ, సూపర్వైజర్ మానస, కౌన్సిలర్ శకుంతల, బాల వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాశరావు, అప్హోల్డ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి.డేవిడ్‌రాజు, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కె.శిరీష తదితరులు పాల్గొన్నారు.


