శత్రువులకు సింహస్వప్నాలు.. ఆపదలో దేవదూతలు | - | Sakshi
Sakshi News home page

శత్రువులకు సింహస్వప్నాలు.. ఆపదలో దేవదూతలు

Nov 25 2026 9:42 AM | Updated on Nov 25 2026 9:42 AM

● నింగి నుంచి నీలిసంద్రం దాకా..

తూర్పు నౌకాదళానికి కీలక బలం

విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళం పరిధిలోని విశాలమైన సముద్ర తీరాన్ని పర్యవేక్షించడంలో ‘321 వైజాగ్‌ ఫ్లైట్‌’బృందం పాత్ర అనిర్వచనీయం. ఐఎన్‌ఎస్‌ డేగా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూనే సముద్రంలో గస్తీ తిరిగే యుద్ధనౌకలకు అవసరమైన కమ్యూనికేషన్‌, రవాణా, నిఘా సేవలు అందిస్తోంది. తీరప్రాంత భద్రతను పటిష్టం చేయడంలోనూ, నౌకాదళ విన్యాసాల్లోనూ ఈ యూనిట్‌ తన నైపుణ్యాన్ని నిరంతరం చాటుకుంటూ తూర్పు తీరానికి రక్షణ కవచంలా నిలుస్తోంది. 54 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఏంజిల్‌ యూనిట్‌లో పనిచేసిన ఎంతోమంది పైలట్లు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది తమ చెమట, అంకితభావంతో ఈ గొప్ప వారసత్వాన్ని నిర్మించారు.

ది ఏంజెల్స్‌

చేతక్‌ స్క్వాడ్రన్‌

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం తన సుదీర్ఘ సముద్ర నిఘా కార్యకలాపాలలో ప్రపంచ దేశాల్లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. తన సామర్థ్యాన్ని పెంచుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది. ఈ బలీయమైన వ్యవస్థలో ఎన్నో మైలురాళ్లు అధిరోహిస్తోంది. ఇండియన్‌ నేవీ వైమానిక స్క్వాడ్రన్‌ ‘ఐఎన్‌ఏఎస్‌ 312 ఆల్బాట్రాస్‌ స్క్వాడ్రన్‌’ఆవిర్భవించి 50 ఏళ్లు పూర్తవగా.. తూర్పుతీర రక్షణలో కీలకపాత్ర పోషిస్తున్న ‘321 వైజాగ్‌ ఫ్లైట్‌–ది ఏంజిల్స్‌’54 ఏళ్ల అద్భుత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ భద్రతకు వెన్నెముకగా నిలుస్తూ.. శత్రువుల కదలికలను పసిగట్టడంలో ఈ దళాలు అందిస్తున్న సేవలు అనిర్వచనీయం. ఈ రెండింటి వార్షికోత్సవాల్ని వివిధ ప్రాంతాల్లో నౌకాదళ అధికారులు, సిబ్బంది వారం పాటు ఘనంగా నిర్వహించారు.

సూపర్‌ కాన్‌స్టెలేషన్‌ నుంచి పీ–8 వరకూ.. : ఆల్బాట్రాస్‌ స్క్వాడ్రన్‌ 1977లో ఇల్యూషిన్‌ ఐఎల్‌–38 విమానాలను, 1988లో శక్తివంతమైన ట్యూపోలెవ్‌టీయూ–142ఎం విమానాల్ని తన అమ్ముల పొదిలో చేర్చుకుంది. 1992లో తమిళనాడు అరక్కోణంలోని ఐఎన్‌ఎస్‌ రజాలీ స్థావరానికి మారిన ఈ స్క్వాడ్రన్‌.. 2013లో అత్యంత అధునాతనమైన బోయింగ్‌ పీ–8ఐ విమానాలను ప్రవేశపెట్టడంతో కొత్త శకానికి నాంది పలికింది. వేల మైళ్ల దూరంలోని కదలికలను సైతం క్షణాల్లో పసిగట్టి నౌకాదళ ప్రధాన కేంద్రానికి కచ్చితమైన సమాచారాన్ని చేరవేయడంలో ఈ విమానాలు తిరుగులేని సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 1988లో మాల్దీవుల్లో చేపట్టిన ‘ఆపరేషన్‌ కాక్టస్‌’, 1999 కార్గిల్‌ యుద్ధ సమయంలో ‘ఆపరేషన్‌ విజయ్‌’, 2001–02లో ‘ఆపరేషన్‌ పరాక్రమ్‌’, 2025లో ‘ఆపరేషన్‌ సిందూర్‌’సమయంలో ప్రధాన సైనిక చర్యల్లో ఈ దళం శత్రువుల ఎత్తుగడలను పసిగట్టి విజయాల్లో భాగస్వామ్యమైంది.

‘ది ఏంజిల్‌ చేతక్‌’ప్రస్థానమిది: ‘321 వైజాగ్‌ ఫ్లైట్‌’విజయ ప్రస్థానంలో అత్యంత కీలకమైనది ‘చేతక్‌’హెలికాప్టర్‌. ఐదున్నర దశాబ్దాలుగా భారత నౌకాదళానికి వెన్నెముకగా ఉన్న ఈ హెలికాప్టర్లు విశ్వసనీయతకు, సమర్థతకు మారుపేరుగా నిలిచాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సముద్రం మధ్యలో ఉన్న యుద్ధనౌకల డెక్‌లపై సురక్షితంగా ల్యాండ్‌ కావడంలోనూ చేతక్‌ తన సత్తా చాటుతోంది. నౌకాదళం అప్పగించిన వేలాది మిషన్లను ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తిచేసిన ‘ది ఏంజెల్స్‌’తమ బృందానికి తిరుగులేని బలంగా మారింది.

ఆపద్బాంధవులుగా..

‘ది ఏంజెల్స్‌’ప్రధాన బాధ్యత సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించడం. తుపానులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, మత్స్యకారులు, సముద్రంలో చిక్కుకున్న నౌకల సిబ్బందిని రక్షించడంలో ఈ యూనిట్‌ ఎప్పుడూ ముందుంటుంది. ‘మెడికల్‌ ఎవాక్యుయేషన్‌’మిషన్‌లను అత్యంత వేగంగా, సురక్షితంగా పూర్తిచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది ‘ది ఏంజిల్‌’బృందం.

ఒకే హెలికాప్టర్‌తో మొదలై.. : 1972 నవంబర్‌ 15న విశాఖలోని ఐఎన్‌ఎస్‌ సర్కార్‌ వద్ద కేవలం ఒకే ఒక్క చేతక్‌ హెలికాప్టర్‌తో ‘321 వైజాగ్‌ ఫ్లైట్‌ ఏంజిల్‌’బృందం ఆవిర్భవించింది. కాలక్రమేణా తూర్పుతీరంలో నౌకాదళ అవసరాలు పెరగడంతో హెలికాప్టర్ల సంఖ్య 6కి పైగా విస్తరించగా.. ఈ విభాగాన్ని విశాఖలోని ప్రధాన నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు మార్చారు. సముద్రంలో చిక్కుకున్న వారికి, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆపదలో ఉన్న పౌరులకు ఆపద్బాంధవులుగా మారి ప్రాణాలు కాపాడటంలో ఈ విభాగం చూపే తెగువకు గుర్తుగా దీనికి ‘ది ఏంజెల్స్‌’(దేవదూతలు) అని పేరు పెట్టారు.

50 ఏళ్లు పూర్తి చేసుకున్న

నేవీ ‘ఆల్బాట్రాస్‌’, ‘ఏంజిల్‌ చేతక్‌’

1971 భారత్‌–పాక్‌ యుద్ధం తర్వాత

ఆల్బాట్రాస్‌ స్క్వాడ్రన్‌ ఆలోచన

1976లో సముద్ర జలాలపై

నిఘా కోసం అంకురార్పణ

సూపర్‌ కాన్‌స్టెలేషన్‌ నుంచి

పీ–8 వరకూ సాంకేతిక ప్రస్థానం

ఐదు దశాబ్దాలుగా చేతక్‌ సేవలు

‘ఆల్బాట్రాస్‌ స్క్వాడ్రన్‌’ ప్రస్థానమిది

1971 భారత్‌–పాక్‌ యుద్ధం తర్వాత సముద్ర జలాలపై నిరంతర నిఘా ఉంచేందుకు.. యుద్ధనౌకలు, హెలికాప్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే తీరప్రాంత గస్తీ విమానాల ఆవశ్యకతను భారత నౌకాదళం గుర్తించింది. ఈ క్రమంలో 1976 నవంబర్‌ 18న గోవాలోని ఐఎన్‌ఎస్‌ హన్సా వద్ద ఐఎన్‌ఏఎస్‌–312 ఆల్బాట్రాస్‌ స్క్వాడ్రన్‌ని అధికారికంగా ప్రారంభించారు. భారత వైమానిక దళం నుంచి బదిలీ అయిన 5 లాక్‌హీడ్‌ సూపర్‌ కాన్‌స్టెలేషన్‌ విమానాలతో ఈ దళం తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement