ఏకగ్రీవాల కోసం కూటమి కుయుక్తులు
వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులపై ఒత్తిడి
జిల్లాలో 79 పంచాయతీలకు
2,888 నామినేషన్లు
ముగిసిన నామినేషన్ల పరిశీలన..
27 ఉపసంహరణ గడువు
సాక్షి, విశాఖపట్నం: పల్లె పోరులోనూ కూటమి కుట్రలు ఆగట్లేదు. పంచాయతీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతు అభ్యర్థులపై ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 79 గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేనాటికి మొత్తం 2,888 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార కూటమి నేతలు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను ఏకగ్రీవాల పేరుతో తమ ఖాతాలో వేసుకునేందుకు కూటమి నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ సీపీ మద్ధతుదారులనే టార్గెట్‌గా..
ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే భయంతో కూటమి నేతలు కుయుక్తులకు తెరలేపారు. ముఖ్యంగా వైఎస్సార్‌సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి వారినే లక్ష్యంగా కుట్రలకు పాల్పడుతున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాభివృద్ధి నిధుల పేరుతో ఆశ చూపుతూనే, తమ మాటకు తలొగ్గని అభ్యర్థులపై ప్రలోభాలు, బెదిరింపుల పర్వానికి దిగుతున్నారు. కొందరు స్థానిక నాయకులు అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రత్యర్థి అభ్యర్థుల కుటుంబ సభ్యులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మరికొన్ని చోట్ల గ్రామ అభివృద్ధి అంటూ మాయమాటలు చెప్పి వేలం పాట పేరుతో కొనుగోలుకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజాతీర్పునే నమ్ముకుని బరిలో నిలిచేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. దీంతో జిల్లాలోని పలు గ్రామాల్లో ఎన్నికల వేడి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఉపసంహరణపైనే అందరి దృష్టి
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం అధికారులు తదుపరి ప్రక్రియకు సర్వం సిద్ధం చేశారు. దాఖలైన 2,888(సర్పంచ్–458, వార్డు సభ్యులు–2,430) నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. నిబంధనల మేరకు అభ్యర్థుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హత కలిగిన నామినేషన్ల జాబితాను అధికారులు ప్రకటించారు. వీటిలో సర్పంచ్ 428, వార్డు సభ్యులు 2398 నామినేషన్లు ఫైనల్ చేశారు. బుధవారం నుంచి అభ్యంతరాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ తుది గడువు. దీంతో గడువు ముగిసేలోపు వీలైనన్ని ఎక్కువ పంచాయతీలను ఏకగ్రీవం చేసుకునేందుకు కూటమి నేతలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. ప్రలోభాలు, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకుని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ నేతలు ఎన్నికల అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
మండలాల వారీ అర్హత పొందిన నామినేషన్లు
మండలం సర్పంచ్ నామినేషన్లు వార్డు నామినేషన్లు
స్థానాలు స్థానాలు
భీమిలి 16 76 166 494
ఆనందపురం 26 149 260 743
పద్మనాభం 22 103 226 664
పెందుర్తి 15 100 150 497
మొత్తం 79 428 802 2398


