మూడు ముక్కలాట! | - | Sakshi
Sakshi News home page

మూడు ముక్కలాట!

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

తెల్లార్లూ..
క్లబ్‌లో జోరుగా పేకాట దందా

● భారీగా కొత్త సభ్యత్వాలు

● ఎమ్మెల్యే అండదండలున్నాయంటూ విచ్చలవిడితనం

● గుడివాడ నుంచి వచ్చి మరీ దందా

● నామమాత్రంగా మారిన క్లబ్‌ యాజమాన్యం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:

నగరంలోని ఓ క్లబ్‌ ఇప్పుడు మూడు ముక్కలాటకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి వేళ మొదలయ్యే పేకాట.. అర్ధరాత్రి దాటినా ఆగడం లేదు. ఏకంగా తెల్లవారుజామున 2 గంటల వరకూ యథేచ్ఛగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గుడివాడ నుంచి వచ్చిన ఓ వ్యక్తి క్లబ్‌లో తిష్టవేసి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. కూటమి పార్టీలకు చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలు ఉండటంతోనే సదరు వ్యక్తి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పేకాట నిర్వహణే లక్ష్యంగా భారీగా కొత్త సభ్యత్వాలు కల్పించి, రాత్రీ పగలూ తేడా లేకుండా ఆట సాగిస్తున్నట్టు తెలుస్తోంది. క్లబ్‌ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన యాజమాన్యాన్ని పక్కనపెట్టి గుడివాడ బ్యాచ్‌ అంతా తామై వ్యవహరిస్తుండటం గమనార్హం.

అనధికారిక ఆటకు అధికారిక ముసుగు

నగరంలో చారిత్రక ప్రాధాన్యమున్న ఈ క్లబ్‌ ఒకప్పుడు ఎంతో ఘనత వహించింది. కాలక్రమంలో ప్రాభవం కోల్పోయినా, క్లబ్‌లో నిధులకు మాత్రం కొదవలేదని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు అదే క్లబ్‌ పేకాటకు కేంద్రంగా మారడంపై దీర్ఘకాలంగా సభ్యులుగా ఉన్న సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాలక్షేపం కోసం పరిమితంగా జరగాల్సిన ఆటను పూర్తిస్థాయి వ్యాపారంగా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే గత కొంతకాలంగా భారీగా కొత్త సభ్యత్వాలు కల్పించినట్టు సమాచారం. కొత్తగా సభ్యత్వం పొందిన వారిలో ఎక్కువ మంది పేకాట ఆడేందుకే క్లబ్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి క్లబ్‌ నిబంధనల ప్రకారం సీనియర్‌ సభ్యులకు మాత్రమే ఆటకు అనుమతి ఉంటుందని చెబుతున్నారు. గతంలో అనధికారిక సభ్యులతో పేకాట నిర్వహించే ప్రయత్నం చేయగా, ఫిర్యాదులు రావడంతో నిలిపివేసినట్టు సమాచారం. ఈసారి ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా కొత్త సభ్యత్వాల ముసుగులో పేకాటను నిరాటంకంగా కొనసాగించేలా పథకం రచించినట్టు ఆరోపణలున్నాయి.

ఆటకు రూ.2 వేలు

పేకాట నిర్వహణ పేరుతో జరుగుతున్న వసూళ్లు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా క్లబ్బుల్లో పది ఆటలకు కలిపి నిర్వహణ ఖర్చుల కింద రూ.1,200 వరకు వసూలు చేస్తుంటారని, వాల్తేరు తదితర క్లబ్బుల్లోనూ ఇదే విధానం అమల్లో ఉందని చెబుతున్నారు. అయితే, సదరు క్లబ్‌లో మాత్రం ఒక్కో ఆటకు ఏకంగా రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంటే పది ఆటలతో కూడిన ఒక్కో రౌండ్‌కు రూ.20 వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన రోజుకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూళ్లు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ భారీ మొత్తంలో ఎమ్మెల్యేతో పాటు పోలీసు సిబ్బందికి కూడా వాటాలు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరి వాటాలు వారికి ముడుతుండటంతోనే రాత్రి 2 గంటల వరకూ పేకాట సాగుతున్నా పట్టించుకునేవారు లేకుండా పోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉన్నతాధికారులు కన్నెర్ర చేసేనా?

చారిత్రక ప్రాధాన్యమున్న క్లబ్‌ పేకాట దందాకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు నగరంలో చర్చనీయాంశంగా మారాయి. అసలు క్లబ్‌ యాజమాన్యం పాత్ర ఏమిటి? కొత్త సభ్యత్వాల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి? రోజుకు లక్షల రూపాయల వసూళ్లలో ఎవరి వాటా ఎంత? ఎమ్మెల్యే, పోలీసుల ప్రమేయంపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. క్లబ్‌లో రాత్రీ పగలూ తేడా లేకుండా సాగుతున్న ఈ మూడు ముక్కలాటకు అడ్డుకట్ట వేసేవారే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి, సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

గుడివాడ బ్యాచ్‌ పెత్తనం

క్లబ్‌ నిర్వహణలో యాజమాన్యం పాత్ర నామమా త్రంగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నా యి. కొత్త సభ్యత్వాల మంజూరు నుంచి పేకాట నిర్వహణ వరకూ అన్ని వ్యవహారాలను గుడివాడ నుంచి వచ్చిన వ్యక్తే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. గతంలోనూ అనధికారికంగా పేకాట డెన్‌లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో సదరు వ్యక్తిపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఓ క్లబ్‌ ను కేంద్రంగా చేసుకుని అదే తరహా వ్యవహారాన్ని నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి ఓ కూటమి ఎమ్మెల్యే అండదండలు అందిస్తున్నారనే ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా సదరు ఎమ్మెల్యేకు నెలనెలా భారీగా ముడుపులు అందుతున్నాయనే విమర్శలు ఉన్నా యి. స్థానిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందికి కూడా ముడుపులు అందించేలా ఒప్పందం కుదిరిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అర్ధరాత్రి వరకు ఆట సాగుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement