జనసేన ఆనందపురం మండల అధ్యక్షుడు అప్పలరాజుకు తీవ్ర పరాభవం వైస్ ఎంపీపీ ఎన్నికలో చేతులెత్తని సొంత పార్టీతో పాటు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు గద్గద స్వరంతో సమావేశం నుంచి నిష్క్రమణ
తగరపువలస: ఆనందపురం మండల పరిషత్ కార్యాలయం వేదికగా గురువారం జరిగిన ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు తీవ్ర నాటకీయ పరిణామాలకు దారితీశాయి. సొంత పార్టీతో పాటు కూటమి నేతల నుంచే జనసేన మండల పార్టీ అధ్యక్షుడు, పాలవలస ఎంపీటీసీ సభ్యుడు తమ్మిన అప్పలరాజుకు ఊహించని రీతిలో భంగపాటు ఎదురైంది. తోటి సభ్యులందరి ముందే జరిగిన ఈ పరిణామంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో మండలంలోని మొత్తం 17 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్‌సీపీ 7, టీడీపీ 6, జనసేన 4 స్థానాలను గెలుచుకున్నాయి. ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి 9 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి కావడంతో కూటమిలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత టీడీపీకి చెందిన వేములవలస ఎంపీటీసీ బంటుపల్లి సత్యవేణి, జనసేన ఎంపీటీసీ తమ్మిన అప్పలరాజు ఎన్నికకు హాజరుకాకుండా తమ అసమ్మతిని తెలియజేశారు. దీంతో కూటమి శిబిరంలో ఒక్కసారిగా అలజడి రేగింది.
హామీ ఇచ్చి.. చివరి నిమిషంలో ట్విస్ట్
పరిస్థితిని చక్కదిద్దేందుకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మేనల్లుడు చిక్కాల విజయ్‌బాబు, జనసేన ఇన్‌చార్జ్ పంచకర్ల సందీప్ రంగంలోకి దిగి అసమ్మతి నేతలతో చర్చలు జరిపారు. వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని తమ్మిన అప్పలరాజుకు నమ్మబలికి సమావేశానికి ఒప్పించారు. అనంతరం జరిగిన ఎంపీపీ ఎన్నికలో అప్పారావుకు మద్దతుగా టీడీపీ, జనసేనకు చెందిన 10 మంది ఎంపీటీసీలు చేతులెత్తి ఎన్నుకున్నారు. అయితే, అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. వైస్ ఎంపీపీ ఎన్నిక సమయానికి సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పలరాజు అభ్యర్థిత్వానికి మద్దతుగా సొంత పార్టీ జనసేన సభ్యులతో పాటు టీడీపీకి చెందిన 9 మంది ఎంపీటీసీలు చేతులెత్తకుండా మిన్నకుండిపోయారు. ప్రత్యామ్నాయంగా టీడీపీ ఎంపీటీసీ యమున పేరును ప్రతిపాదించగా, కూటమిలోని 9 మంది సభ్యులు చేతులెత్తి ఆమెను ఎన్నుకున్నారు.
పదేళ్ల కష్టానికి ఇదేనా ప్రతిఫలం?
ఈ పరిణామంతో తీవ్ర అవమానభారానికి గురైన తమ్మిన అప్పలరాజు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. పదేళ్లుగా మండలంలో జనసేన పార్టీని తన భుజస్కంధాలపై మోశానని, అందుకు సొంత పార్టీ నేతలు, టీడీపీ ఎంపీటీసీలు తన పట్ల అత్యంత అన్యాయంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో మరచిపోలేని గుణపాఠం నేర్పారంటూ గద్గద స్వరంతో అక్కడి నుంచి ఇంటిబాట పట్టారు.


