బాల మేధస్సుకు ‘సైన్స్‌’ సలాం! | - | Sakshi
Sakshi News home page

బాల మేధస్సుకు ‘సైన్స్‌’ సలాం!

Nov 20 2026 2:24 AM | Updated on Nov 20 2026 2:24 AM

● సృజనాత్మకతకు వేదికగా సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు ● మొత్తం 266 ప్రాజెక్టుల ప్రదర్శన ● రాష్ట్ర స్థాయికి 7 ప్రాజెక్టుల ఎంపిక

చిన్నారుల ఆలోచనల్లోనే భవిష్యత్తు విజ్ఞాన ప్రపంచం దాగి ఉంది. వారి ఊహాశక్తికి సృజనాత్మకత తోడైతే సరికొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకుంటాయి. ఇందుకు 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు వేదికయ్యాయి. పర్యావరణ పరిరక్షణ నుంచి ఇంధన పొదుపు వరకు.. వ్యవసాయం నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు.. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తూ బాల మేధావులు తమ ప్రతిభను చాటారు. చిన్న వయసులోనే శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనలు, సృజనాత్మకతతో అబ్బురపరిచారు.

సీతంపేట: బుల్లయ్య కళాశాలలో గురువారం 32వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. ‘సుస్థిరత కోసం విజ్ఞానశాస్త్రం, ఆవిష్కరణలు’ ప్రధాన ఇతివృత్తంగా ఈ పోటీలు జరిగాయి. వ్యర్థాల నిర్వహణ కోసం ఆర్‌5 విధానం, శక్తి కోసం ఈ4 విధానం, నీటి సేకరణ, వినియోగం, పునర్వినియోగం, సంరక్షణ, ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిరత కోసం భారతీయ జ్ఞాన వ్యవస్థల అనువర్తనం వంటి ఐదు ఉప అంశాలపై విద్యార్థులు తమ ప్రాజెక్టులను రూపొందించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు తమ ప్రాజెక్టు గైడ్‌ టీచర్లతో కలిసి ప్రాజెక్టు నివేదికలు, లాగ్‌బుక్‌లు, చార్టులు, అవసరమైన సామగ్రితో హాజరై ఆవిష్కరణలను ప్రదర్శించారు.

విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెరగాలి

విద్యార్థుల్లో సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో దోహదపడతాయని డీఈవో ఎన్‌.ప్రేమకుమార్‌ అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు శాసీ్త్రయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో విశాఖ జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 266 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఐదు ఉప అంశాల నుంచి మొత్తం ఏడు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు జిల్లా సమన్వయకర్త పి.రాజారావు తెలిపారు. డిసెంబరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టులు ప్రదర్శనకు రానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్‌ సమన్వయకర్త శ్రీనివాస్‌, బుల్లయ్య కళాశాల ప్రతినిధులు పాల్గొన్నారు. జ్యూరీ సభ్యులుగా బుల్లయ్య కళాశాల డిగ్రీ, పీజీ అధ్యాపకులు వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement