మహారాణిపేట: శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 9 నుంచి జనవరి 7 వరకు నిర్వహించనున్న ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది ఐదు గురువారాలు ఉండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 20 వేల మంది, గురువారాల్లో 34 వేల నుంచి 60 వేల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున క్యూలైన్లు, బారి కేడింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ త్వరితగతిన దర్శనం కల్పించాలని సూచించారు. తొలిసారిగా ఆన్లైన్ దర్శన టికెట్ల సదుపాయం అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, ఆలయ పరిసరాల్లో సూచిక బోర్డులు, మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా భక్తులకు సమాచారం అందించాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, పారిశుధ్య నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని, 31 మొబైల్ టాయిలెట్లు, ఐదు శాశ్వత మరుగుదొడ్ల వద్ద మూడు షిఫ్టుల్లో సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. రద్దీ ప్రాంతాల్లో బారికేడింగ్, చెప్పుల స్టాండ్లు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ మళ్లింపుపై ముందస్తు అవగాహన కల్పించాలన్నారు. జనవరి 7న జరిగే మహా అన్నప్రసాద వితరణకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వచ్చే వారం జరిగే సమీక్ష నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఆర్డీవో దిలీప్‌కుమార్, దేవస్థానం ఈవో శోభారాణి, ఆలయ కమిటీ చైర్మన్ కందుల నాగరాజు, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


