అదే బాబు.. మాటల డాబు! | - | Sakshi
Sakshi News home page

అదే బాబు.. మాటల డాబు!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

● అన్నీ నేనే చేశానంటూ చంద్రబాబు పాత పాట

● పారిశ్రామికవేత్తల కుర్చీల్లో విద్యార్థులు.. డెలిగేట్ల ముసుగులో టీడీపీ అనుచరులు

● పాత ఒప్పందాలకే కొత్త రంగులు.. ఎంవోయూల పేరుతో హడావుడి

● ప్రచారం ఆకాశమంత.. క్షేత్రస్థాయిలో అంతా డొల్ల!

● తొలిరోజే తేలిపోయిన భాగస్వామ్య సదస్సు అసలు రంగు

సాక్షి, విశాఖపట్నం: ప్రచారం భూమండలాన్ని దాటినా.. క్షేత్రస్థాయిలో మాత్రం డొల్లతనమే కనిపించింది. ‘అన్నీ నేనే అభివృద్ధి చేశా’ అంటూ క్రెడిట్‌ చోరీకి పాల్పడే చంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు తొలిరోజు అట్టర్‌ఫ్లాప్‌ అయింది. పారిశ్రామికవేత్తలు కూర్చోవాల్సిన కుర్చీల్లో విద్యార్థులు.. ప్లీనరీ సెషన్లలో వక్తలుగా టీడీపీ నేతల అనుచరులు.. డెలిగేట్ల పేరుతో ఆ పార్టీ నాయకులు.. వెరసి ‘చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ’ అన్న చందంగా పాత ఒప్పందాలకే కొత్త ముసుగు వేసి హడావుడి చేశారు. ప్రపంచస్థాయి ఏర్పాట్లంటూ గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వ డొల్లతనం సదస్సు ప్రారంభోత్సవంలోనే బయటపడింది.

విద్యార్థులతో సభా ప్రాంగణం నింపేశారు

అసలు కథ ఉదయమే మొదలైంది. సదస్సు ప్రారంభోత్సవ సమయానికి పెట్టుబడిదారులు, డెలిగేట్లు పెద్దగా కనిపించకపోవడంతో సభా ప్రాంగణం వెలవెలబోయింది. పరువు పోతుందనుకున్నారో ఏమో.. హడావుడిగా గీతం, కృష్ణా, ఉమెన్స్‌ కాలేజీలతోపాటు ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్థులను ప్లీనరీ హాళ్లకు, ప్రధాన ప్రాంగణానికి తరలించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి సదస్సుకు వచ్చిన పారిశ్రామికవేత్తలు, ముఖ్య అతిథులకు అక్కడ విద్యార్థులే కనిపించారు. అప్పటికే కుర్చీలన్నీ విద్యార్థులతో నిండిపోవడంతో నిజమైన పారిశ్రామికవేత్తలకు కూర్చోవడానికి చోటు లేక కొంతసేపు నిలబడాల్సి వచ్చింది. ప్రపంచస్థాయి ఏర్పాట్లు చేశామన్న చంద్రబాబు మాటలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పలువురు అసహనం వ్యక్తం చేశారు. ప్రచార ఆర్భాటం తప్ప సదస్సులో ఆశించిన స్థాయిలో భాగస్వాములు కనిపించడం లేదన్న విషయం ప్రారంభంలోనే స్పష్టమైంది. ఇదిలా ఉండగా, సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విద్యార్థులు బయటకు వెళ్లిపోవడం మొదలుపెట్టారు. కీలక ప్రసంగాలు జరుగుతున్న సమయంలోనే కుర్చీలు ఖాళీ అవుతుండటంతో అప్రమత్తమైన అధికారులు.. బయటకు వెళ్తున్న విద్యార్థులను తిరిగి హాళ్లలోకి రప్పించారు.

పాత సీసాలో కొత్త ఎంవోయూలు

ప్లీనరీ సెషన్లలోనూ చంద్రబాబు మార్కు ప్రచార ఆర్భాటమే కనిపించింది. కొన్ని సెషన్లలో పారిశ్రామిక రంగంతో సంబంధం ఉందన్న కారణంతో మంత్రులు, ఎమ్మెల్యేల అనుచరులను వక్తలుగా కూర్చోబెట్టినట్లు ఆరోపణలు వినిపించాయి. ఆయా సెషన్లకు ఆశించిన స్థాయిలో ప్రతినిధులు హాజరుకాకపోవడంతో విద్యార్థులను హడావుడిగా తరలించి హాళ్లను నింపాల్సి వచ్చింది. ఇక పెట్టుబడుల ఒప్పందాల విషయంలోనూ కొత్తదనం కనిపించలేదు. గతంలో కుదుర్చుకున్న కొన్ని ఎంవోయూలనే మళ్లీ కొత్తగా కుదుర్చుకున్నట్లుగా ప్రచారం చేసుకున్నారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. పాత ఒప్పందాలకు కొత్త హంగులు అద్ది భారీ పెట్టుబడులంటూ హడావుడి చేయడం సదస్సు నిర్వహణ తీరుపై అనుమానాలకు తావిచ్చింది.

నేడు ముగింపు సదస్సు

ఈ భాగస్వామ్య సదస్సు శుక్రవారం రాత్రితో ముగియనుంది. రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్లీనరీ హాళ్లలో పలు అంశాలపై సెషన్లు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నాయి. అనంతరం ప్రధాన వేదికపై సదస్సు ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరుకానున్నారు.

ఖాళీ ఉందా.. విద్యార్థులను పంపండి!

సభ ప్రారంభమైన రెండు, మూడు గంటలకే ప్రధాన వేదిక వద్ద కుర్చీలు ఖాళీ అయ్యాయి. దీంతో అధికారులు తర్జనభర్జన పడ్డారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు మరోసారి విద్యార్థులు, చిరుద్యోగులపైనే ఆధారపడ్డారు. వివిధ కార్పొరేట్‌ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఐటీ, పర్యాటక, పరిశ్రమలు, ఆస్పత్రుల రంగాలకు చెందిన సిబ్బందిని హడావుడిగా రప్పించి ప్రాంగణాన్ని నింపేందుకు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఆలస్యంగా వచ్చిన నిజమైన డెలిగేట్లకు కూర్చోవడానికి కుర్చీలు కూడా కరువయ్యాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఒక్కో కుర్చీలో ఇద్దరు చొప్పున సర్దుకుని కూర్చోవాల్సి వచ్చింది. పారిశ్రామికవేత్తలతో కళకళలాడాల్సిన సదస్సులో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ప్రభుత్వ నిర్వహణా వైఫల్యానికి అద్దం పట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement