జెడ్పీ చైర్మన్‌ పీఠంపై కూటమి కుస్తీ! | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్మన్‌ పీఠంపై కూటమి కుస్తీ!

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

చైర్మన్‌ పదవి కోసం

టీడీపీ, జనసేన నేతల ప్రయత్నాలు

అభ్యర్థి ఎంపికపై ఐవీఆర్‌ఎస్‌ సర్వే

ఈ నెల 23న ఎన్నిక..

అగ్రనేతల అనుగ్రహం కోసం

ఆశావహుల ఆరాటం

మహారాణిపేట: విశాఖ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠంపై కూటమిలో కుర్చీలాట మొదలైంది. ఈ నెల 23న జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుండటంతో ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. బీసీ జనరల్‌కు కేటాయించిన ఈ పదవిని దక్కించుకునేందుకు తెలుగుదేశం, జనసేన నేతలు పావులు కదుపుతున్నారు. రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా పరిషత్‌గా ఉన్న విశాఖ జెడ్పీ చైర్మన్‌ పదవిపై పలువురు నేతలు కన్నేశారు. మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాల్లో మూడు టీడీపీ, ఒకటి జనసేన గెలుచుకోవడంతో పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. నాలుగు జెడ్పీటీసీ స్థానాల నుంచి ఒకరికి చైర్మన్‌, మరొకరికి వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి.

జెడ్పీ పీఠంపై ఆశలు : ఏటా రూ.కోట్ల బడ్జెట్‌ ఉండటంతో జెడ్పీ చైర్మన్‌ పదవిపై పలువురు ఆశలు పెట్టుకున్నారు. జిల్లా పరిషత్‌ జనరల్‌ ఫండ్స్‌, ఆర్థిక సంఘం నిధులు, ఇతర అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో కీలక పాత్ర ఉండటంతో ఈ పదవికి ప్రాధాన్యం పెరిగింది. మండలాలు తగ్గినా జిల్లా పరిషత్‌ పరిపాలన వ్యవస్థ, నిధుల కేటాయింపుల ప్రక్రియ యథావిధిగా కొనసాగనున్నాయి.

తెరపైకి కొత్త పేర్లు: ఇప్పటి వరకు టీడీపీ నేతల మధ్యే పోటీ ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఆనందపురం జెడ్పీటీసీగా జనసేన తరఫున గెలిచిన ఎన్ని శ్రీనివాసరావు సైతం చైర్మన్‌ పదవి కోసం గట్టి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. టీడీపీ నుంచి భీమిలి జెడ్పీటీసీ గాడు అలివేలు పేరు మొదటగా తెరపైకి వచ్చినప్పటికీ.. తర్వాత పెందుర్తి జెడ్పీటీసీ అజయ్‌ ఎ.ఎన్‌.సుఖవాసి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ అగ్రనాయకత్వం విశాఖలోనే ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

జనసేనకు

కేటాయించాలంటూ ఒత్తిడి

జీవీఎంసీ మేయర్‌ పదవిని జనసేనకు కేటాయించలేదనే అసంతృప్తి ఆ పార్టీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో కనీసం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవినైనా జనసేనకు కేటాయించాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. మరోవైపు మూడు జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న టీడీపీ నేతలు సైతం చైర్మన్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో కూటమి పెద్దలు ఎవరికి అవకాశం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 23న జరిగే ఎన్నికతో చైర్మన్‌ పీఠంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement