అల్లిపురం: స్వచ్ఛ సర్వేక్షన్ 2025–26లో విశాఖపట్నం జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల విభాగంలో దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా విశాఖ నిలవడంపై అధికారులను అభినందించారు. గురువారం ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఈ అవార్డును ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అవార్డు సాధనకు సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు.


