పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌ | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్‌

Nov 13 2026 8:39 AM | Updated on Nov 13 2026 8:39 AM

సాక్షి, విశాఖపట్నం : పెట్టుబడిదారులకు భారత్‌ ఎడారిలో ఒయాసిస్‌లా కనిపిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. భారత జీడీపీ వృద్ధిలో విదేశీ పెట్టుబడులతోపాటు నైపుణ్యం కలిగిన యువత కూడా కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భారతీయ యువత ప్రపంచవ్యాప్తంగా తమ నైపుణ్యాలను చాటుకుంటోందని తెలిపారు. విశాఖలో గురువారం ప్రారంభమైన రెండు రోజుల 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి హాజరైన పారిశ్రామిక ప్రతినిధులు, రాయబారులు, ప్రభుత్వ ప్రతినిధులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఆయా ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు అనువైన రంగాలను తెలియజేస్తూ కీలక ప్రతిపాదనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జన్‌ విశ్వాస్‌ పిలుపునకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంతో పరిశ్రమలకు రియల్‌ టైమ్‌లో అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పెట్టుబడులకు సంబంధించిన ప్రక్రియల్లో జాప్యం లేకుండా అనుమతులు, భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలను వేగంగా అందిస్తున్నామని వివరించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ విధానం అమలుకు కియా కార్ల పరిశ్రమ ఒక ఉదాహరణగా నిలుస్తోందన్నారు. విశాఖ నగరం స్టీల్‌ సిటీ నుంచి సిలికాన్‌ సిటీగా ఎదుగుతోందని పీయూష్‌ గోయల్‌ పేర్కొన్నారు. ఓర్వకల్లు, పూడిమడక వంటి ప్రాంతాలు గ్రీన్‌ ఎనర్జీ కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

సీఐఐ సదస్సును ప్రారంభించిన

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement